గతేడాది అక్టోబర్, నవంబర్ నెలలో తిరుపతి వణికిపోయింది. ఎటు చూసినా వరద బీభత్సం భయానకం సృష్టించింది. గతంలో ఎన్నడూ చూడని వర్షాలు, వరదలతో తిరుపతి వాసులు బెంబేలెత్తిపోయారు. శ్రీవారి దర్శనాలకు వెళ్లిన భక్తులు అవస్థలు పడ్డారు. రోడ్లు తెగిపోవటంతో రవాణా మార్గాలు స్తంభించిపోయాయి. పలుచోట్ల రైల్వే లైన్లు కొట్టుకుపోవటంతో రైళ్లు రద్దు చేశారు రైల్వేశాఖ. దాంతో గంటలు, రోజుల తరబడి ప్రయాణికులు, భక్తులు నరకయాతన అనుభవించారు. ఒక్క తిరుపతిలోనే కాదు, రాయలసీమలోని పలు జిల్లాలపై వరుణుడు ప్రతాపం చూపించాడు. అనంతరంపురం, కర్నూలు, కడప జిల్లాల్లో కురిసిన వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. కడపలో ఏకంగా ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయిన సంఘటన యావత్ దేశంలోనే సంచలనం రేపింది. తాజాగా మరోమారు రాయలసీమ జిల్లాలకు ఏపీ వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందును ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం కూడా స్పందించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు జిల్లాలకు పిడుగు హెచ్చరికలు చేసింది వాతావరణ శాఖ. తిరుపతి అర్బన్, రేణిగుంట,నారాయణవనం, కెవిబి పురం, నాగులాపురం, పిచ్చాటూరు, పుత్తూరు ప్రాంతవాసులను అలర్ట్ ఉండాలని చెప్పారు విపత్తుల సంస్థ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్. ఇక చిత్తూరు జిల్లాలోని నగరి, నిండ్ర, విజయపురంలో పిడుగు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు అన్నమయ్య, కురబలకోట, మదనపల్లె, బి.కొత్తకోట, గుర్రంకొండ, కలికిరి, వాయల్పాడు. కర్నూలు జిల్లాలోని చిప్పగిరి, మద్దికెర ఈస్ట్, ఆదోని, ఆస్పరి, పెద్దకడుబూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు. సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందాలని సూచించారు.