హోమంత్రిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఏపీ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే.. ఈ విషయంలో హోం మంత్రి అనిత వివరణ ఇచ్చినప్పటికీ.. విమర్శలు మాత్రం ఆగలేదు.. ఈ క్రమంలో హోం మంత్రి అనిత ఆసక్తికర పోస్ట్ చేశారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తో మార్యదపూర్వకంగా సమావేశమైనట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారన్నారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం తమ కూటమి ప్రభుత్వం అంటూ అనిత పేర్కొన్నారు.
ఇటీవల పిఠాపురం పర్యటనలో రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ క్రమంలో హోం మంత్రి బాధ్యత వహించాలని.. మరింత కఠినంగా వ్యవహరించాలంటూ పవన్ కల్యాణ్ సూచించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందిచిన హోంమంత్రి అనిత.. దీనిని తాను పాజిటివ్‌గా తీసుకుంటున్నానని చెప్పారు.. హోంమంత్రిగా తాను ఫెయిల్ అని పవన్ ఎక్కడా అనలేదని.. పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే.. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం.. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం.. వెనువెంటనే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హోమంత్రి అనిత సమావేశం అవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..