
విజయవాడలో జనవరి 19న ప్రారంభించబోయే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దేశానికే తలమానికంగా నిలిచే ఈ విగ్రహం చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుందన్నారాయన. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరిట విజయవాడ బందర్ రోడ్డులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది. సీఎం జగన్ చేతుల మీదుగా జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్‌కు విజయవాడ రెడీ అయింది. 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు. దీని మొత్తం ఎత్తు 206 అడుగులు ఉంటుంది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా చెప్పాలి. 18.81 ఎకరాల్లో స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 9 ఎకరాల్లో పూర్తిగా పచ్చదనాన్ని నింపారు. యాంఫీ థియేటర్, మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. లైబ్రరీతో పాటు ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేయించారు. దాన్ని భాగాలుగా విజయవాడకు తరలించి స్మృతివనంలో క్రమ పద్ధతిలో అతికించి అద్భుతంగా తీర్చిదిద్దారు. విగ్రహం తయారీలో షూ దగ్గర్నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లుండగా.. ఒక్కోటి నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. అందులో ఒకటి సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రజలకు, అంబేద్కర్ అభిమానులకు పిలుపునిచ్చారు జగన్. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో పాటు సామాజిక సమతా సంకల్ప సభకు సంబంధించిన పోస్టర్‌ను వైసీపీ నేతలు విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ సీఎం జగన్.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చారిత్రక నిర్ణయమన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో 19వ తేదీన ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. నగరం వెలుపల నుంచే భారీ, మధ్య తరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపులు చేస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..