AP CM on PRC: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో గుడ్‌న్యూస్.. పీఆర్సీపై సీఎం జగన్ కీలక సమీక్ష!
AP Govt. Employees PRC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త చెప్పేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు.
AP CM YS Jagan Review on PRC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త చెప్పేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ(పీఆర్సీ) ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పీఆర్సీ సాధన కోసం సంఘాలు కార్యచరణ కూడా ప్రకటించాయి. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సైతం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పీఆర్సీపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వేతన సవరణకు సంబంధించి కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు.
పీఆర్సీ సవరణ కమిటీ సిఫార్సులను పరిశీలించిన సీఎం.. ఎంతమేరకు పెంచాలన్న దానిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే, కొత్త సవరణ ప్రకారం 34 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటూ ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్‌ల్లో సందేశాలు వైరల్ అవుతున్నాయి. పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయం సోమవారం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కరించకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి పీఆర్సీతో సహా ఉద్యోగుల సమస్యలన్నీ తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చాయి. జేఏసీలు ఇచ్చిన ఐక్య ఉద్యమ కార్యాచరణకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నిరసన కార్యాక్రమాల్లో పాల్గొంటున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులు ఉద్యమానికి ఊతం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్.. ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సీపీఎస్ రద్దు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులను సర్వీసులను పర్మినెంట్ చేయడం.. వంటి కీలక అంశాలపైన సీఎం చర్చించినట్లు సమాచారం.
Read Also.. Mangalagiri: ఇప్పట్లో ఎన్నికలు లేవు.. అయితేనేం, ఎత్తులు పైఎత్తులతో హీటెక్కిన మంగళగిరి.. కారణమేమంటే..?