Kishan Reddy meet YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగా సీఎంను కిషన్ రెడ్డి కలిసినట్లు అధికారులు తెలిపారు. అధికార పర్యటనకు విజయవాడ వచ్చిన కిషన్ రెడ్డిని భోజనానికి ఆహ్వానించారు.. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి చేరుకున్నారు. సాదరంగా స్వాగతం పలికిన.. అనంతరం కిషన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేశారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మంత్రి వెల్లంపల్లితో కలిసి సీఎం జగన్ నివాసానికి చేరుకున్నారు కిషన్ రెడ్డి.
ఏపీ సీఎం జగన్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అరగంట పాటు సీఎం నివాసంలో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదంపై కూడా వీరిద్దరి సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తొలిసారిగా ఏపీకి వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని సీఎం జగన్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రికి వెంకటేశ్వర స్వామ చిత్ర పటాన్ని సీఎం జగన్ బహుకరించారు. అనంతరం కిషన్ రెడ్డి దంపతులకు పట్టువస్త్రాలను అందజేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం…
విజయవాడ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి గాయమైంది. కారు ఎక్కుతుండగా కిషన్‌రెడ్డి తలకు డోర్ తగలడంతో గాయం తగిలింది. విజయవాడలో గురువారం జరిగిన జన ఆశీర్వాద సభ ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆయనను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అంతకుముందు కిషన్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర కొనసాగుతోంది. తెలంగాణలోని నల్లబండగూడెం నుంచి జన ఆశీర్వాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కోదాడ బహిరంగ సభలో సాయంత్రం కిషన్‌రెడ్డి పాల్గొనాల్సి ఉండగా ప్రస్తుతం వాటికి గైర్హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also…. AP CM YS Jagan: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై సీఎం జగన్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు..