Eluru Akkireddigudem Fire Accident: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీతో భారీగా మంటలు చెలరేగడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. పోరస్ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇదిలాఉంటే.. పోరస్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం అనంతరం అక్కిరెడ్డిగూడెం వాసులు పెద్ద ఎత్తున్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫ్యాక్టరీని గ్రామం నుంచి తీసివేయాలంటూ.. ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కాగా.. పోరస్ ఫ్యాక్టరీలోని యూనిట్ 4లో మంటలు చెలరేగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో విధుల్లో 17 మంది కార్మికులు ఉన్నారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనం కాగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరోకరు మృతి చెందారు.
Also Read: