ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్(CM.Jagan) రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉచిత విద్యుత్‌కు చెందిన డబ్బును నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని వెల్లడించారు. తద్వారా విద్యుత్ బిల్లులను రైతులే చెల్లిస్తారని తెలిపారు. ఇంధన శాఖపై బుధవారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పద్ధతి అమలైతే విద్యుత్ సేవలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీగా విద్యుత్ కొనుగోలు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మార్చిలో 1,268.69 మిలియన్ యూనిట్లను రూ.1,123.74 కోట్లు వెచ్చించి కొన్నామని వెల్లడించారు. ఏప్రిల్‌లో 1,047.78 మిలియన్ యూనిట్లను రూ.1,022.42 కోట్లతో కొన్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను నివారించేందుకు తక్షణం ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అదనపు సామర్ధ్యాలను జోడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
కృష్ణపట్నం యూనిట్లలో 800 మెగావాట్ల అదనపు యూనిట్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా అధికారులకు సూచించారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పవర్ హాలిడేను కొనసాగిస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి