ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. గురువారం హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులను కలవనున్నారు. అలాగే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు తెలుస్తోంది. కొంతమంది కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కోసం సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోనే మకాం వేసిన వైసీపీ ఎంపీలు రక్షణ, ఆర్థికశాఖ మంత్రుల అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని అమిత్ షాను సీఎం కోరే అవకాశం ఉందని తెలిసింది.
అలాగే, రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు సహకారాన్నీ కోరతారని సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బిల్లులు, కొవిడ్ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం వంటి అంశాలనూ సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానికి ఒకే గొంతుక వినిపించాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు ఇటీవల జగన్ లేఖలు రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయంపై తీవ్రంగా చర్చ జరగుతోంది.కాగా సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్నప్పటికీ చివరి నిముషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.