ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కోనసీమ జిల్లాను ‘అంబేడ్కర్ కోనసీమ’ జిల్లాగా పేరు మార్పు చేస్తూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ నిర్ణయం ఇలావుంటే.. అదే సమయంలో కోర్టులోనూ పిటీషన్లు దాఖలయ్యాయి. కోనసీమకు ఇప్పుడున్న పేరే కొనసాగించాలని.. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో పన్నెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటి పైనా కలిసి విచారించాలని కోర్టు నిర్ణయించింది. ఇదే సమయంలో కోనసీమ జిల్లా పేరు పైన జిల్లా వాసుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. గత నెల 18న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.
ఇక, జిల్లా పేరు మార్పు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. జిల్లాలో 1300 మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు.