
ఏపీలో కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పోస్టుల పోటీ నెలకొంది.. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికై నెలన్నర కావస్తున్నా నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీల కీలక నేతలంతా నామినెటెడ్ పోస్టుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటికే టిడిపి, జనసేన కసరత్తు ప్రారంభించగా బీజేపీ సైతం తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అవకాశాలను బేరిజు వేసుకుంటుంది.. తమకు సముచిత స్థానం కల్పించడమే పొత్తు ధర్మం అంటుంది.
వివరాల్లోకి వెళ్తే.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టింది. కాకపోతే పోస్టుల పంపకాలే.. కూటమికి పెద్ద టాస్క్‌గా మారనున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో టిడిపి ,జనసేన ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా.. ఇప్పుడు బీజేపీ సైతం తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ రేసులోకి వచ్చింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కమలదళం… మిత్రపక్షాల మాదిరే , కొత్తగా వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. అయితే, నామినేటెడ్ పోస్టుల ద్వారా పార్టీ విస్తరణ మరింత వేగవంతమవుతుందని భావిస్తున్న కమలం పార్టీ… భవిష్యత్ నాయకులని తీర్చిదిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశమనుకుంటోంది. అందుకే, పదవుల పంపకంలో తమకూ ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది.
ప్రజాక్షేత్రంలో ఉండేలా… ప్రభుత్వం నుంచి ఏదో పదవి ఉంటే… అది పార్టీ బలోపేతానికి కూడా ఎంతోకొంత ఉపయోగపడుతుందన్న ఆలోచనలో బీజేపీ ఉంది. అందుకే, ఈ పదవుల పంపకంపై ప్రధానంగా దృష్టిపెట్టింది. సాధారణంగా ఒకే పార్టీ అధికారంలో ఉంటే, అన్ని పోస్టులు ఆ పార్టీకే వస్తాయి. పంపకాల్లోనూ పెద్ద సమస్య ఉండదు. కానీ ఏపీలో ప్రస్తుతం మూడు పార్టీలతో ఏర్పడిన ప్రభుత్వం ఉంది.. కాబట్టి నామినేటెడ్ పదవుల పంపకం అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన సీనియర్స్ అంతా… పదవుల కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు.
అయితే, తమకు అవకాశం ఇవ్వాలంటూ… బీజేపీ నేతల నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి భారీగా అప్లికేషన్స్ వస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా రోజుకి 30 నుంచి 40 అప్లికేషన్స్ వస్తుండటంతో… బిజెపి రాష్ట్ర అధినాయకత్వం, ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరుపుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, తమకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతోంది. ఇప్పటికే, బీజేపీ చీఫ్ పురందేశ్వరి, ఈ విషయాలన్నింటినీ సీఎం చంద్రబాబు ముందు ఉంచారు. పొత్తు ధర్మం ప్రకారం కేటాయింపులు జరగాలంటూ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను… చంద్రబాబుతో చర్చించారు పురంధేశ్వరి. కేంద్రంలో నామినేటెడ్ పోస్టులను టిడిపి, జనసేన అడుగుతున్నాయ్ కాబట్టి… రాష్ట్రంలోనూ తమకు తగిన అవకాశాలు ఇవ్వాలంటున్నారు కమలనాథులు. నామినేటెడ్ పోస్టుల పంపకాలపై ఇప్పటికే కూటమి పార్టీల మధ్య ఓ లెక్క కుదిరిందనే ప్రచారం కూడా జరుగుతోంది. టిడిపికి 60, జనసేనకి 30, బిజెపికి 10 శాతం చొప్పున… పోటీ చేసిన సీట్ల ప్రకారం పదవుల పంపకం ఉంటుందని తెలుస్తోంది.
పొత్తు ధర్మం ప్రకారమైతే… జనసేన, బీజేపీ నేతలకూ నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నాయకులు, ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీలకు పదవులకేటాయింపు ఒక్కటే కాదు.. వాటిని ఏకోటాలో, ఏయే నేతలకు కేటాయిస్తారన్నదీ ఉత్కంఠ రేపుతోంది. సీనియర్ల కోణంలో చూస్తే… బీజేపీలో ఆ లిస్టు ఎక్కువగా ఉంటుంది. టీడీపీతో కలిసి గతంలో నాలుగేళ్లు అధికారంలో ఉన్నా… పెద్దగా నామినేటెడ్ పోస్టులు దక్కలేదు. ఒక్క సోము వీర్రాజకు మాత్రం ఎమ్మెల్సీ పదవి లభించింది. అందుకే, ఈ సారి సోము వీర్రాజుకు రాజ్యసభ స్థానం ఇచ్చి, ఇతర సీనియర్లకు ఎమ్మెల్సీలు, కేబినెట్ హోదాతో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీలో చాలామంది సీనియర్లు టిక్కెట్‌కోసం ప్రయత్నించి.. విఫలమయ్యారు. విష్ణువర్దన్ రెడ్డి అనంతపురం జిల్లా కదిరి స్థానం కోసం గట్టిగా ప్రయత్నించినా… ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించడంతో సాధ్యం కాలేదు… సోము వీర్రాజు, మాధవ్ , భాను ప్రకాష్‌లాంటి సీనియర్ నేతలు కూడా… టిక్కెట్ల కోసం ప్రయత్నించి హైకమాండ్ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు. టికెట్‌రాకపోయినా… కూటమి గెలుపుకోసం పనిచేశారన్న పేరు మాత్రం సంపాదించారు. అందుకే ఇప్పుడు తమకు పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అలాగైతేనే, కష్టానికి తగ్గఫలితం, గుర్తింపు దక్కుతుందన్న నమ్మకం కార్యకర్తలు, నేతల్లో కలుగుతుందంటున్నారు.
అయితే ఇప్పటివరకు కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పదవులపై అఫీషియల్ మీటింగ్ జరగలేదు. కాబట్టి, ఎవరికి ఎన్ని పదవులనే విషయంలో.. జరిగేదంతా ప్రచారమే అంటున్నాయి కూటమి పక్షాలు. త్వరలోనే ఈ పదవుల పంపకాలపై ఒక స్పష్టత మాత్రం వస్తుందని చెబుతున్నాయి. మరి, స్పష్టత ఎలా ఉంటుంది? బిజెపి కోరుకుంటున్నట్టు తగిన ప్రాధాన్యం లభిస్తుందా? లేదా? చూడాలి.