
ఏపీలో ఎన్నికల వేళ ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు చేపట్టారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్ తో పాటు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి నోటీసులిస్తూ ఈనెల 29న వివరణ ఇవ్వాలని సూచించారు. పార్టీలు ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదులపై సంతృప్తికర సమాధానం ఇవ్వాలని.. లేదంటే అనర్హత వేటు తప్పదని నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్..
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చాలా రోజుల క్రితం చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఈ లోగానే రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనర్హత పిటీషన్ల పై ఇప్పటికే స్పీకర్ 8 మందికి నోటీసులిచ్చారు. అయితే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు 30రోజుల సమయం కావాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్ మాత్రం 29న ప్రత్యక్షంగా విచారణకు హాజరుకావాల్సిందేనని ఎమ్మెల్యేలకు మళ్లీ పంపిన లేఖలో స్పష్టం చేశారు. మరి.. 29న ఎమ్మెల్యేలు హాజరవుతారా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ స్పందించారు. టీడీపీ అధినేతతో చర్చించి న్యాయసలహాల సూచనల మేరకు తదుపరి స్పందనను వెల్లడిస్తామన్నారు. వంశీ, బలరాం, గణేష్‌లు వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న మద్దాలి గిరి నాలుగు రోజుల గడువు కోరారు. ఫైనల్‌గా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎంతమంది స్పీకర్ ఎదుట హాజరవుతారా? ఒకవేళ హాజరైతే ఎలాంటి వివరణ ఇస్తారు? ఆ వివరణతో స్పీకర్ సంతృప్తి చెందకపోతే అనర్హత వేటు వేస్తారా అన్నది పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..