Jangareddygudem mystery deaths: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో సంభవించిన వరుస మిస్టరీ మరణాలపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వరుస మరణాలపై టీడీపీ సోమవారం అసెంబ్లీలో చర్చకు పట్టుపట్టింది. సభ మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు సభను అడ్డుకున్నారు. వెల్‌లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలు జరిగిన తర్వాత.. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పినా.. తమ ఆందోళన కొనసాగించారు. టీడీపీ సభ్యులు తమ సీట్లలోకి వెళ్లకపోవడంతో సభ వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభమైన వెంటనే.. టీడీపీ సభ్యులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. స్పీకర్ పోడియం చుట్టూ చేరి ఆందోళన చేయడంతో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, రామానాయుడు, డీబీవీ స్వామిని సస్పెన్షన్ చేసినట్లు ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రటకించారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. మార్షల్స్ రంగప్రవేశం చేసి.. వారిని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
జంగారెడ్డి గూడెం వరుస మరణాలపై సభలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రకటన చేస్తుండగా.. టీడీపీ సభ్యులు చర్చకు అవకాశం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సీనియర్ సభ్యులు ఇంత మంది ఉండి.. సభను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదంటూ స్పీకర్ తమ్మినేని సూచించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పొడియాన్ని చుట్టిముట్టి.. పేపర్లు చించి ఎగురవేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మర్యాదగా వ్యవహరించాలని.. ప్రజలు వికృత చేష్టలను చూస్తున్నారంటూ మండిపడ్డారు. బడ్జెట్‌పై చర్చ జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.