మంత్రుల ఫిర్యాదుపై చర్చించిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ.. నిమ్మగడ్డకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం..!

|

Mar 18, 2021 | 7:52 PM

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సిత్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఆయన వద్దే వద్దన్న పార్టీ.. మిగిలిన ఎన్నికలు పూర్తి చేసి వెళ్లాలంటుంది.

మంత్రుల ఫిర్యాదుపై చర్చించిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ.. నిమ్మగడ్డకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం..!
Ap Assembly Privilege Committee Key Decision On Ap Sec Nimmagadda Ramesh Kumar
Follow us on

assembly privilege committee key decision : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సిత్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఆయన వద్దే వద్దన్న పార్టీ.. మిగిలిన ఎన్నికలు పూర్తి చేసి వెళ్లాలంటుంది. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించినవారే ఆయన కరెక్ట్ అంటున్నారు. ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించాలంటూ గగ్గోలు పెట్టారు. ఆయన ఏకంగా కోర్టు మెట్టెక్కి పదవి కాపాడుకున్నారు. దర్జాగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగిలిన పరిషత్ ఎన్నికలను కూడా జరిపించేందుకు సిద్ధమవుతున్నారు.

మూడు నెలల క్రితం.. అంతా ఉప్పు నిప్పు లాంటి పరిస్థితి. ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. ఇప్పుడే అక్కర్లేదని ప్రభుత్వం కోర్టులకెక్కి కొట్లాడాయి. ఎన్నికలు ఎలా పెడతావో చూస్తావని ప్రభుత్వంలో కొంతమంది నేతలు… ఎలాగైనా పెట్టాల్సిందేనని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పట్టుబట్టారు. పంచాయతీల ఏకగ్రీవానికి ప్రభుత్వం పిలుపిస్తే.. ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఎస్‌ఈసీ ప్రకటనలు చేశారు. ఎన్నికలు జరిగిన తర్వాత పరిస్థితి మారింది. పంచాయతీ ఎన్నికలు పూర్తి నాలుగో దశ పూర్తి కాకుండానే.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు నిమ్మగడ్డ.

పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మెజార్టీ గ్రామాలను దక్కించుకుని దుమ్మురేపింది. ఇటు మునిసిపల్ ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్ చేసింది. గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్ల దాకా దాదాపు అన్నింటిల్లోనూ అధికార పార్టీ వైసీపీ అధిపత్యం కనబర్చింది. రూరల్‌ తో పాటు అర్బన్‌లోనూ అధికార పార్టీ బలంగా ఉన్నట్లు తేల్చి చెప్పాయి స్థానిక సంస్థల ఎన్నికలు. ఇదే ఊపులో పరిషత్ ఎన్నికల్ని కూడా నిర్వహించాలని కోరుతోంది అధికార పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికలన్నీ నిమ్మగడ్డ చేతుల మీదనే పూర్తి చేస్తే మంచిదని వైసీపీ నేతలు అంటున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని జనసేన అనేక సందర్బాల్లో ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసింది. జనసేనతోపాటు టీడీపీ ఫిర్యాదులపైనా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వేగంగా స్పందించారు. పోటీ చేసిన అభ్యర్థులకు భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జనసేన పెర్‌ఫామెన్స్‌ బాగానే ఉంది. దీంతో పరిషత్ ఎన్నికలను కూడా ఇప్పుడే నిర్వహించాలని అది కూడా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసేలోగా జరపాలంటోంది జనసేన.

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. మరోవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు సంబంధించి ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై విచారణ చేపట్టాలని కమిటీ నిర్ణయించిందని ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఈసీపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై ప్రివిలైజ్‌ కమిటీ రెండో సమావేశాన్ని వర్చువల్‌ విధానంలో బుధవారం నిర్వహించారు. అలాగే, మంత్రి పెద్దిరెడ్డి మరో ఫిర్యాదు ఇచ్చారు. సమావేశంలో ఈ రెండు ఫిర్యాదులపై చర్చించారు. నిమ్మగడ్డ విచారణకు అందుబాటులో ఉండాలని శాసనసభ కార్యదర్శి ద్వారా నోటీసులు అందిస్తున్నామన్నారు. వీలైనంత త్వరలో విచారణ పూర్తిచేస్తామని.. దీనికి సంబంధించిన తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ విచారణకు ఎస్‌ఈసీ అందుబాటులో ఉండాలి అన్నారు. ఆయన వ్యక్తిగతంగా, లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చే అవకాశం కల్పించామన్నారు.

ఇదిలావుంటే, నిమ్మగడ్డ రేపటి నుంచి 22 వరకూ సెలవు ఇవ్వాలని కోరారు. ఈ సెలవు కనుక మంజూరైతే… ఈ నెలలోనే పరిషత్ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. అధికార ప్రతిపక్షాల నుంచి వస్తున్న విజ్ఞాపనలపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండిః Telangana MLC Election Results 2021 LIVE: కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు