AP Rains: వాయుగుండం అలెర్ట్.. ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ఆ జిల్లాలకు మళ్లీ వానలే వానలు..

దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో సముద్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా..

AP Rains: వాయుగుండం అలెర్ట్.. ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ఆ జిల్లాలకు మళ్లీ వానలే వానలు..
Ap Rains

Updated on: Nov 16, 2022 | 8:48 AM

ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మళ్లీ వర్షాలు ముంచెత్తనున్నాయి. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో సముద్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 18 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని మంగళవారం ఓ నివేదికలో పేర్కొంది.

ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో మళ్లీ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే వాయుగుండంగా మారిన తర్వాత తీరం వెంబడి 40-45 కి.మీ మేరకు ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.

మరోవైపు ఏపీవ్యాప్తంగా చలి తీవ్రత పెరగనుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రాబోయే మూడు లేదా నాలుగు రోజులు ఉదయం వేళలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో ఉంటాయని.. కొన్ని ప్రదేశాల్లో పొగమంచుతో కూడిన తేమ వాతావరణ చూడొచ్చునని పేర్కొన్నారు. అలాగే 17, 18, 19 తేదీల్లో విజయవాడ, గోదావరి, రాయలసీమ ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందన్నారు.