Antarvedi Temple: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నూతన రథానికి అత్యాధునిక టెక్నాలజీ హెడ్రాలిక్ బ్రేక్స్‌ని అమర్చారు. ఈ రథాన్ని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణు, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పరిశీలించారు. అనంతరం స్థానికుల సమక్షంలో రథాన్ని ట్రయల్ రన్ చేశారు. రథాన్ని తాళ్లతో ముందుకు లాగారు. ఈ కార్యక్రమంలో స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడారు. నూతన రథం బాగుందన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రథాన్ని తయారు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే కొన్నాళ్ల క్రిందట అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గుడిలో ఉన్న రథానికి మంటలు అంటుకుని దగ్ధం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. మరోవైపు.. ఈ ఘటనపై విచారించిన పోలీసులు ఇప్పటి వరకూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దగ్ధమైన రథం స్థానంలో కొత్త రథాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నూతన రథాన్ని సిద్ధం చేశారు. రథం నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. దాంతో ఇవాళ ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు.
Also read: