Oxford English Mini Dictionary in Jagananna Vidya Kanuka : ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులకు ప్రభుత్వం ఒక వినూత్న కానుకను అందించనుంది. ఇక మీదట ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌లో ఒక చిన్నసైజ్ ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు ఇవ్వనున్నారు. నిఘంటువులను కొనుగోలు చేసేందుకు ఇవాళ పాలనా అనుమతిని ఇచ్చింది జగన్ సర్కారు. విద్యా కానుక కిట్‌లో ఇంగ్లిష్ – ఇంగ్లిష్ – తెలుగు డిక్షనరీ చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న మొత్తం 23.5 లక్షల మందికి విద్యార్థులకు నిఘంటువు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇలా ఉండగా, పిల్లలంతా బడికి వచ్చేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు జగనన్న కానుకల కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా కరోనా నేపథ్యంలో రోజుకి 50 మంది విద్యార్థుల తల్లిదండ్రులను బడికి ఆహ్వానించి వారి చేతికి కిట్స్ అందజేస్తారు. బయోమెట్రిక్ పద్ధతిలో తల్లుల వేలిముద్ర లేదా ఐరిష్ తీసుకుంటారు. విద్యార్థికి అందించే ఒక్కో కిట్ కోసం 1,450 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
ఈ కిట్‌లో స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు వర్క్ పుస్తకాలు , బెల్ట్, మూడు మాస్కులు ఉంటాయి. జగనన్న విద్యాకానుక యూనిఫామ్‌ల కుట్టుకూలి కోసం విద్యార్ధుల తల్లుల అకౌంట్‌లోకి రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది 650 కోట్లు జమ చేశారు. ఈ ఏడాది నుంచి కొత్తగా ఆరో తరగతి నుంచి విద్యాకానుక కిట్ లో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కూడా జత కానుంది.