Visakhapatnam: రెండు భారీ నావికాదళ విన్యాసాల కోసం విశాఖ సాగర తీరం ముస్తాబవుతోంది. ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూ, మిలన్ 2022 కోసం ఆర్కే బీచ్ రోడ్డు సుందరంగా రూపుదిద్దుకుంటుంది. అయితే బీచ్ ఫ్రంట్ భవనాలకు రంగులు వేసుకోవాలని జివిఎంసి సూచిస్తోంది. వేయకపోతే స్వయంగా తామే వేస్తామని చెబుతోంది జీవీఎంసీ. నగరాన్ని అందంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ సూచనలు ఇస్తోంది. మరికొద్ది రోజుల్లో విశాఖలో జరిగే రెండు భారీ నౌకాదళ విన్యాసాల కోసం ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. విశాఖ కీర్తి పతాక మరోసారి ప్రపంచ పటంలో ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నెల 21న ప్రెసిడెంట్ ఫ్లిట్ రివ్యూ, 25 నుంచి మార్చి 4వ తేదీ వరకు మిలన్ 2022 నావికాదళ విన్యాసాలతో మరోసారి విశాఖ మెరుపులు మెరిపించనుంది.
కాగా, ప్రెసిడెంట్ ఫ్లిట్ రివ్యూ, మిలాన్ 2022 సమీపిస్తున్న నేపథ్యంలో బీచ్ రోడ్‌ను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రధానంగా విన్యాసాలు జరిగే ఆర్కే బీచ్ రోడ్ లో అందంగా పెయింటింగ్స్ చేస్తున్నారు. అతిథులతో పాటు పాల్గొన్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బీచ్ రోడ్‌ను నో హ్యాకర్ జోన్ గా ప్రకటించారు.
ప్రధానంగా పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు ప్రత్యేక దృష్టి సారించారు. గోడకు ఆకర్షణీయమైన రంగులు వేస్తున్నారు. బీచ్ గట్లపై, విద్యుత్ స్తంభాలపై వెలసిన పోస్టర్లను తొలగిస్తున్నారు. పాడైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అవసరమైతే ఒక లేయర్ టారు రోడ్డు వేయాలని నిర్ణయించారు. విద్యుత్ స్తంభాలకు పెయింట్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నిరుపయోగంగా ఉన్న స్థంభాలను తొలగిస్తున్నారు. ఇందుకోసం జీవీఎంసీ నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు.
కాగా ఆర్కే బీచ్ రోడ్ లో ఉన్న బీచ్ ఫ్రంట్ అపార్ట్మెంట్ లను ప్రత్యేక రంగులతో అందంగా ముస్తాబు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బీచ్ ఫ్రంట్ భవనాలకు రంగులు వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. లేకుంటే తామే స్వయంగా రంగులు వేస్తామని అంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా అపార్ట్‌మెంట్ల అసోసియేషన్‌తో మాట్లాడారు జీవీఎంసీ అధికారులు. అంతర్జాతీయ స్థాయిలో విన్యాసాలతో పాటు ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో భవనాలకు పెయింటింగ్స్ అందంగా ఉండేలా చూడాలని సూచనలు జారీ చేశారు. అయితే ఇప్పటికే చాలామంది అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు ముందుకు వచ్చి అపార్ట్‌మెంట్లలో రంగులు వేసేందుకు సిద్ధమయ్యారు. మరికొన్ని అపార్ట్‌మెంట్లకు తామే పెయింటింగ్స్ వేసే విషయంలో చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాలకు అందరి సహకారం అందించాలని కోరుతున్నారు మేయర్. అయితే.. బీచ్ రోడ్ నో హ్యాకర్ జోన్ గా ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిపిఎం నాయకులు.పెయింటింగ్స్ వేసుకొమని అపార్ట్‌మెంట్ లకు సూచనలు జారీ చేయడం సరికాదని అంటున్నారు. జీవీఎంసీ అధికారుల తీరును నిరసిస్తూ గాంధీ విగ్రహం ఎదుట ప్రదర్శన చేశారు.
కాగా, ఈ నెల 21న జరిగే పిఎఫ్‌ఆర్ కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ వస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారు. లీడర్ రివ్యూలో 60 నౌక లతో పాటు సబ్ మీరైన్లు, 50కిపైగా యుద్ధ విమానాలు హెలికాప్టర్లు పాల్గొంటాయి. 25వ తేదీ నుంచి మిలన్ 2022 విన్యాసాలు ప్రారంభమవుతాయి. వివిధ దేశాల నావికాదళం ఈ విన్యాసాల్లో పాల్గొననున్నాయి. 26న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారు. 27న ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఉంటుంది. ఆరోజు కూడా సీఎం హాజరవుతారు. మొత్తం మీద.. ఇప్పటికే స్మార్ట్ సిటీ గా రూపు దిద్దుకుంటున్న విశాఖ.. పిఎఫ్ఆర్, మిలన్ 2022 తో ఆర్కే బీచ్ మరింత సుందరంగా ముస్తాబు అవుతోంది.
Also read:
Viral Video: టీవీ చూస్తున్న కుక్క ఏం చేసిందో తెలుసా.. వైరల్ అయిన వీడియో..