Andhra Pradesh: 600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం ఏంటో తెలుసా..?

అన్నమాచార్యులు నడచిన తిరుమల కాలిబాట ప్రస్తుతం మూసివేయబడింది. 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మార్గం అభివృద్ధికి గతంలో ప్రయత్నాలు జరిగినా.. కుక్కలదొడ్డి సమీపంలో ఏనుగుల సంచారం, ప్రాణహాని కారణంగా అటవీ శాఖ మూసివేసింది. భక్తులు, రాజకీయ నాయకులు ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh: 600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం ఏంటో తెలుసా..?
Annamayya Footpath To Tirumala

Edited By: Krishna S

Updated on: Dec 06, 2025 | 5:57 PM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు 600 సంవత్సరాల క్రితం స్వామివారిని దర్శించుకునేందుకు తాళ్లపాక నుంచి తిరుమలకు అటవీ మార్గం గుండా నడచి వెళ్ళేవారు. దీనిని అన్నమయ్య కాలి బాట అంటారు. తాళ్లపాక నుంచి తిరుమలకు అటవీ మార్గం గుండా సుమారు 95 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాజంపేట – తిరుపతి మార్గంలోని కుక్కలదొడ్డి నుంచి అటవీ మార్గం ద్వారా అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. కుక్కలు దొడ్డి నుంచి తిరుమలకు సుమారు 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దారి రాళ్లు, రప్పలు, చెట్లు, చేమల మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొండ ఎక్కడం చాలా తక్కువగా ఉంటుంది.

ఈ మార్గంలో తుంబుర, నారద తీర్థాలు కూడా వస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ దివంగత ఆకేపాటి చెంగల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్నప్పుడు అన్నమాచార్యుల కాలిబాటను అభివృద్ధి చేసేందుకు రాజంపేటకు సంబంధించిన వివిధ వర్గాల వారిని సర్వే చేసుకుంటూ తాళ్లపాక నుంచి తిరుమలకు కాలిబాటలో రావాలని సూచించారు. ఆ మేరకు స్థానికులు కుక్కలదొడ్డి నుంచి తిరుమలకు నడకదారిలో అన్ని పరిస్థితులు చూసుకుంటూ వెళ్లారు. సుమారు 15 కిలోమీటర్ల మేర దారి రాళ్లు రప్పలు చెట్లు చేమలతో ఉంది ఒక కిలోమీటర్ మాత్రం తిరుమల దేవస్థానం వారు సపట దారిని నిర్మించారు. ఈ సపట దారి మాదిరిగా తిరుమల నుంచి కుక్కల దొడ్డి వరకు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. అయితే చెంగల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రతిపాదనలు కూడా చేశారు. అయితే తిరుపతిలో కొంతమంది నుంచి ఈ దారిపై వ్యతిరేకత రావడంతో అన్నమయ్య కాలిబాట అభివృద్ధి కార్యక్రమాలు మూలన పడిపోయాయి.

గత ప్రభుత్వంలో అన్నమయ్య కాలిబాటను ఏర్పాటు చేసేందుకు నిధులు కూడా కేటాయించారు. కానీ గత మూడు నాలుగు నెలల క్రితం కుక్కల దొడ్డి అటవీ ప్రాంత సమీపంలో ఏనుగుల గుంపు దాడి నేపథ్యంలో కొంతమంది చనిపోయారు. ఈ క్రమంలో ఇక్కడ ఏనుగుల సంచారం ఉందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయట పెట్టారు. అందులో భాగంగా ఈ నడక మార్గంలో భక్తులకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో అన్నమయ్య కాలిబాట మార్గాన్ని మూసివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

అటవీశాఖ నిర్ణయంపై వైసీపీ నేతల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కాలిబాట ద్వారా తిరుమలకు తిప్రతి ఏటా పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది కావాలనే రాజకీయం చేస్తూ కాలిబాట మార్గాన్ని మూసివేశారని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో ఏనుగులు, చిరుతలు, పులులు సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూసి వేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.