AP ZP Chairman Election: ముగిసిన కోఆప్షన్ సభ్యుల నామినేషన్‌.. మరికాసేపట్లో కొత్త జెడ్పీటీసీలతో ప్రమాణ స్వీకారం

|

Sep 25, 2021 | 12:41 PM

AP ZPTC Election: 13 జిల్లాలు. 13 మంది జడ్పీ చైర్మన్లు. ఆ 13 మంది అధికార పార్టీ వాళ్లే. జడ్పీల్లో క్లీన్‌స్వీప్‌ చేసింది వైసీపీ. కాసేపట్లో చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను, కోఆప్షన్‌ మెంబర్లను ఎన్నుకుంటారు.

AP ZP Chairman Election: ముగిసిన కోఆప్షన్ సభ్యుల నామినేషన్‌.. మరికాసేపట్లో కొత్త జెడ్పీటీసీలతో ప్రమాణ స్వీకారం
Zp Chairman
Follow us on

AP ZP Chairman Elections: జిల్లాలు. 13 మంది జడ్పీ చైర్మన్లు. ఆ 13 మంది అధికార పార్టీ వాళ్లే. జడ్పీల్లో క్లీన్‌స్వీప్‌ చేసింది వైసీపీ. కాసేపట్లో చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను, కోఆప్షన్‌ మెంబర్లను ఎన్నుకుంటారు. ముందు జడ్పీటీసీ ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఏపీలో ఇవాళ జెడ్పీ చైర్మన్ల ఎన్నిక జరుగుతోంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 640 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలో ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అన్ని జిల్లాల్లో నేటి ఉదయం 10 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు పంచాయతీరాజ్ శాఖ అధికారలు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రిసైడింగ్‌ అధికారి.. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఒక్కో జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, జిల్లాకు ఇద్దరు చొప్పున వైస్‌ చైర్మన్ల ఎన్నికను నిర్వహించనున్నారు. జడ్పీ ఎ‍న్నికలకు ప్రిసైడింగ్‌ అధికారిగా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. కలెక్టర్లు జడ్పీ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్‌తో ప్రమాణం చేయుంచనున్నారు.

ఇప్పటికే చాలా జిల్లాల్లో చైర్మన్లు ఖరారయ్యారు. కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్‌గా వెంకట సుబ్బారెడ్డి పేరు ఖరారైంది. పంజామల జడ్పీటీసీగా గెలుపొందారాయన. వెంకట సుబ్బారెడ్డికి బి ఫారం అందజేశారు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. కృష్ణా జడ్పీ చైర్మన్‌గా ఉప్పాడ హారిక పేరు ఖరారైంది. ఆమె పేరును ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. గుడ్లవల్లేరు జడ్పీటీసీగా గెలిచారు హారిక. ప్రకాశం జడ్పీ చైర్ పర్సన్ గా బూచెపల్లి వెంకాయమ్మ, ఉపాధ్యక్షులుగా సింగరాయకొండకు చెందిన యన్నాబత్తిన అరుణ, మార్టూరుకు చెందిన చుండి సుజ్ణానమ్మ, కో ఆప్షన్ సభ్యులుగా తాళ్లూరుకు చెందిన షేక్ ఆదాం షరీఫ్, సయ్యద్ సబీద్ పాషాను ప్రతిపాదించిన వైసీపీ అధిష్టానం.

2009లో ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ అయ్యారు బూచెపల్లి వెంకాయమ్మ. 2019లో దర్శి నుంచి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే బూచెపల్లి సుబ్బారెడ్డి, కుమారుడు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిల రాజకీయ జీవితాల్లో చేదోడువాదోడుగా ఉన్నారు వెంకాయమ్మ. చిత్తూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా శ్రీనివాసులు( వి.కోట జడ్పిటీసీ), తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా విపర్తి వేణుగోపాల రావు(పి.గన్నవరం జడ్పీటీసీ), అనంతపురం జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌గా బోయ గిరిజమ్మ (ఆత్మకూరు జెడ్పీటీసీ), వైఎస్సార్‌ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఎన్నిక కానున్నారు.

కృష్ణా జిల్లాలో జడ్పీ ఛైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బీసీ మహిళ జడ్పీ పీఠాన్ని అధిష్టించనున్నారు. 13 జిల్లాల్లో చైర పర్సన్‌, ప్రతి జిల్లాకు ఇద్దరు వైస్‌ చైర్‌ పర్సన్లకు ఎన్నిక జరగనుంది.13 జిల్లా పరిషత్‌లు వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతానికిపైగా పదవులు దక్కనున్నాయి. నూరుశాతం జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడం దేశంలోనే ఇదే ప్రథమం.

Read Also…  Gujarat drug: ప్రకంపనలు సృష్టిస్తున్న గుజరాత్‌ డ్రగ్స్‌ కేసు.. డీఆర్‌ఐ వర్గాల దర్యాప్తులో వెలుగులోకి సంచలనాలు.. రంగంలో ఎన్‌ఐఏ