Andhra Pradesh: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏ ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు ఈ జిల్లాల్లో  వర్షాలు..
Andhra Pradesh Weather Update

Updated on: Sep 02, 2026 | 4:17 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయని అధికారులు హెచ్చరించారు. వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం.. పశ్చిమ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన స్పష్టమైన అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఎత్తు పెరిగే కొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే 12 గంటల్లో ఇది బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారే అవకాశముంది. అలాగే రాగల 24 గంటల వ్యవధిలో దక్షిణ ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, వాయువ్య దిశల నుంచి గాలులు బలంగా వీస్తున్నాయి.

రాగల మూడు రోజుల వాతావరణ సూచన

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:

బుధ, గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాంధ్రతో పాటు యానాం పరిసర ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్

దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే వీలుంది. తీర ప్రాంతాలు, బయలు ప్రదేశాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.

రాయలసీమ

రాయలసీమ వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున రైతులు, ఉద్యానవన పంటల సాగుదారులు అప్రమత్తంగా ఉండాలని, తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us