మొహర్రం సెలవు తేదీ విషయంలో ఏపీ సర్కార్ మార్పులు చేసింది. 19వ తేదీ (గురువారం)కి బదులు 20(శుక్రవారం)న మొహర్రం నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ జామా మసీదు ప్రకటన ఆధారంగా మొహర్రం నిర్వహణ ఉంటుందని వెల్లడించింది. ఈనెల 20న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కొవిడ్ మార్గదర్శకాలు విడుదల
మొహర్రం పండుగ సందర్భంగా ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు జారీ చేసింది. 10 మందికి మించకుండా ఆలం నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఊరేగింపులో 30 నుంచి 40 మందికే పర్మిషన్ ఉంటుందని వెల్లడించింది. మంచినీటి సీసాలు మినహా ఇతరత్రా వితరణకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
తెలంగాణలో సైతం మొహర్రం సెలవు దినాల్లో మార్పు
మొహర్రం సెలవు దినాల్లో మార్పు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందు రోజు అయిన 19న ఆప్షన్ హాల్ డే గా ప్రకటించింది. అలాగే మొహర్రం సెలవుల విషయంలో ఆప్షనల్ హాలిడేనా.. లేక జనరల్ హాలిడేనా అన్న గందరగోళం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం స్పందించి సెలవు మార్పులను అందరూ గుర్తించేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 19న సెలవు, 18 ఆప్షనల్ హాలిడే ఉండగా.. వక్ఫ్‌బోర్డు సీఈఓ వినతి మేరకు ప్రభుత్వం వాటిని మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
తెలంగాణలోని కోర్టులు, ట్రైబ్యునళ్లకు కూడా
రాష్ట్రంలోని హైకోర్టుతో సహా అన్ని జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లకు ఈ నెల 20న మొహర్రం సెలవుగా హైకోర్టు ప్రకటించింది. ఈ నెల 19కి బదులుగా 20ను సెలవుగా పరిగణనలోకి తీసుకోవాలంటూ రిజిస్ట్రార్ జనరల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: మూడో రోజు రూ.32.59 కోట్ల రుణమాఫీ.. రైతులకు ప్రభుత్వం స్పెషల్ రిక్వెస్ట్