AP MPP Elections: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల ముగిసిన పరిషత్ ఎన్నికల నేపథ్యంలో మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో ఆప్టెడ్ సభ్యుల అభ్యర్థుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 10 గంటలలోపు నామినేషన్ల స్వీకరణకు అవకాశం ఉండగా.. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు పరిశీలిస్తారు. 12 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఒంటిగంటలోపు ఉపసంహరణకు అవకాశం ఉండగా.. అదే సమయంలో ఎన్నికల అధికారి కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక, ప్రమాణ స్వీకార ప్రక్రియ చేపడతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నిక కోసం సమావేశాలు నిర్వహించనున్నారు.
మండల పరిధిలో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అన్ని చోట్ల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నిర్ణీత కోరం ప్రకారం.. మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన మొత్తం ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లోని 9,583 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారితో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ఆ సమావేశంలోనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత కో ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు మరొకసారి సమావేశం నిర్వహించి, తొలుత ఎంపీపీ పదవికి ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. కాగా, ఉదయం 10 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
ఇదిలావుంటే, ఏదైనా కారణం వల్ల కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండలాల్లో తదుపరి జరగాల్సిన ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తారు. ఒకవేళ కో ఆప్టెడ్ ఎన్నిక పూర్తయి, ఎంపీపీ ఎన్నికకు ఆటంకం ఏర్పడితే, సంబంధిత మండలంలో ఆ తర్వాత జరగాల్సిన ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా పడుతుందని రాష్ట్ర కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన మండలాల్లో శనివారం ఎన్నిక నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రెండో రోజు కూడా వివిధ కారణాలతో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక వాయిదా పడినప్పటికీ, సరిపడా కోరం ఉంటే ఎంపీపీ.. ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించవచ్చని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.