
ముదుర్లు, దేశముదుర్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త ఐడియాలతో చెలరేగిపోతున్నారు. పోలీసులకు చిక్కకుండా మాల్ బోర్డర్ దాటించేందుకు.. నయా మార్గాలను అన్వేశిస్తున్నారు. మద్యం సీసాలు అక్రమ రవాణాకు ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ కార్గో పార్శిల్ సౌకర్యాన్ని వినియోగించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు ఆర్టీసీ కార్గో పార్సిల్ ఆఫీసులో అనూహ్య రీతిలో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. పార్సిల్ సెంటర్‌కు బాగా బరువున్న ఓ సంచి వచ్చింది. దాన్ని దింపే క్రమంలో లిక్కర్ వాసన రావడం గుర్తించారు అక్కడి సిబ్బంది. దీంతో అనుమానం వచ్చి.. అధికారులకు చెప్పి.. ఆ పార్శిల్ ఓపెన్ చేశారు. అప్పుడు బాగోతం బయటపడింది.
అందులో పగిలిపోయిన రెండు లిక్కర్ బాటిల్స్‌తో పాటు మరో 10 సీసాలు ఉండటాన్ని చూసి అందరూ కంగుతిన్నారు. ఇన్ఫర్మేషన్ అందుకున్న సెబ్ ఆఫీసర్స్ విచారణ చేపట్టారు. పార్సిల్ అడ్రస్‌ను ఫాలో అయ్యి పత్తికొండకు చెందిన రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమ మద్యాన్ని రవాణా చేసేందుకు ఈ మార్గాన్ని ఎప్పటి నుంచి వినియోగిస్తున్నారు. ఎవరెవరికి అమ్ముతున్నారనే విషయంపై కంప్లీట్ ఎంక్వైరీ విచారణ చేపడుతున్నట్లు పత్తికొండ సెబ్ అధికారులు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి