ఇంకా రాష్ట్ర పరిపాలన కేంద్రం సచివాలయంలో అడుగు పెట్టలేదు. అయినా తాను చేపట్టిన విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు యువనేత నారా లోకేష్. ఈనెల 15వతేదీన ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించే విద్యార్థులకు గత వైసిపి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వడం నిలిపివేసిందని తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు. పుస్తకాలు లేకుండా పేద విద్యార్థులు ఎలా చదువుతారని ఆ సమావేశంలోనే అధికారులను ప్రశ్నించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తక్షణమే ఇంటర్ విద్యార్థలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ తోపాటు బ్యాక్ ప్యాక్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
జూలై 15 నాటికి పాఠ్యపుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని లోకేష్ ఆదేశించడంతో అధికారులు ఆగమేగాలపై మంగళవారం జీవో ఎం.ఎస్. నెం.28ని విడుదల చేశారు. త్వరలోనే పుస్తకాలు పంపిణీ కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థలు, హైస్కూల్ ప్లస్‌ల్లో కలిపి మొత్తం 2,00,753 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరికి జులై 15లోపు ఒక్కో విద్యార్థికి 12 నోటు పుస్తకాలు బ్యాగ్, టెక్ట్స్ బుక్స్ అందించాలని గవర్నమెంట్ సూచించింది.
సాంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా లోకేష్ తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంగళగిరి ప్రజల కోసం తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు గత నాలుగు రోజులుగా ఉండవల్లి నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..