అమరావతి: గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్లతోపాటు చిన్నాచితక వ్యాపారులు దాదాపు అందరూ ఒకే విధమైన ధరలకు అమ్ముతున్నారు. ఇక ప్రతి ఇంట్లో టమాట లేనిదే కూర చేయరు. ప్రతి వంటకాల్లో ఎక్కువగా వినియోగించే టమోటా ధర ప్రస్తుతం సామాన్యుడికి అందనంత ఎత్తుకి చేరింది. టమాటాలు కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. తాజాగా కిలో టమోటా ధర ఏకంగా రూ.120కి ఎగబాకడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది.
కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో ఇదే ధరకు వ్యాపారులు వినియోగదారులకు అమ్ముతున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం రాయితీపై టమాటలను విక్రయిస్తోంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో కిలో రూ.50 కే విక్రయిస్తుండటంతో ప్రజలు బారులు తీరారు. రాష్ట్రంలోని 103 రైతు బజార్లలో సబ్సిడికి టమాటా విక్రయాలు జరుగుతున్నాయి. డిమాండ్‌ను బట్టి రోజుకు 50 టన్నుల టమాటాలను విక్రయించాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. మరో వైపు సబ్సిడి రేట్ల ప్రజలకు కూరగాయలు అందిస్తున్నా సరఫరా చేయడంలో మాత్రం విఫలమైందని పలువురు విమర్శిస్తున్నారు. అనేక షరతులు పెట్టి ఒకరికి ఒక కిలో మాత్రమే అందిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
సాధారణంగా టమాట కిలో 10 నుంచి 40 రూపాలలోపు ఉంటుంది. ప్రస్తుతం ఏకంగా 120 ఎగబాకింది. చాలా నగరాల్లో 140కి చేరుకుంది. ధరలు పెరగడంతో సామాన్యుడికి పెను భారంగా మారింది. మరోవైపు టమాటా సెంచరీ దాటినప్పటికీ రైతులు మాత్రం లాభాలు చూడలేకపోతున్నారు. మధ్యలో దళారులు లాభాన్ని తన్నుకుపోతున్నారు. రిటైల్ మార్కెట్‌లో నాణ్యతను బట్టి కిలో టమాటాకు 100, 78 రూపాయల వరకు అమ్ముడవుతోంది. వర్షాల కారణంగా టమాటా సాగు ఎక్కువగా ఉండే కర్ణాటకలోని పలు జిల్లాల్లో పంట నష్టంతోపాటు సరఫరాలో అంతరాయం వల్ల ధరలు మోత మోగిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరగనుందని కానుందని అంచనా వేస్తున్నారు.