Andhra Pradesh: టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. నంది అవార్డులపై ముందడుగు

తెలంగాణలో సినీ కళాకారులను ప్రోత్సహించేందుకు గద్దర్ అవార్డులు ఇస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో గతంలో నంది అవార్డులు ఇచ్చేవారు. కానీ గత కొన్నేళ్ల నుంచి ఇవి ఆగిపోయాయి. అయితే ఇఫ్పుడు తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. త్వరలోనే ప్రకటన రానుంది.

Andhra Pradesh: టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. నంది అవార్డులపై ముందడుగు
Ap Government

Updated on: Mar 22, 2026 | 9:08 AM

సినిమా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. నంది అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. త్వరలోనే నంది అవార్డులను ఇస్తామని, సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. సినిమా పరిశ్రమలోని కళాకారులకు తగిన గౌరవం, గుర్తింపు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. నంది అవార్డులను సినిమా నటీనటులకు ఇచ్చేందుకు సముఖంగా ఉన్నామని పేర్కొన్నారు.

విశాఖలో అందమైన లొకేషన్లు

సినిమా షూటింగ్స్ నిర్వహించుకునేందుకు విశాఖలో అందమైన లొకేషన్లు ఉన్నాయని, ఇక్కడ షూటింగ్స్ నిర్వహించేలా ప్రోత్సహిస్తామని కందుల దుర్గేష్ ప్రకటించారు. నిర్మాణ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. అవార్డుల ద్వారా సినిమా, టీవీ, నాటక రంగానికి చెందిన కళాకారులను గౌరవిస్తామని, నంది నాటకోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు. విశాఖను సినిమా పరిశ్రమకు నిర్మాణ కేంద్రంగా మారుస్తామని, ఈ మేరకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించేది. కానీ గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమం నిలిచిపోగా.. ఇప్పుడు తిరిగి పున:ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్ అవార్డ్స్ పేరుతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి అవార్డులు ఇస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ నుంచి డిమాండ్లు

తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఇస్తుండటంతో.. ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులను తిరిగి ప్రారంభించాలనే డిమాండ్లు టాలీవుడ్ నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి ఇదే డిమాండ్ చేస్తారు. చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించడంలో కాస్త వెనకబడి ఉందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్ అవార్డుల పేరుతో సినిమా ఇండస్ట్రీని గౌరవిస్తుందని, ఏపీ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో నడవాలనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. ఇక నారాయణమూర్తి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ స్పూర్తితో ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యల క్రమంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. నంది అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్దమైంది. త్వరలోనే దీనికి సంబంధించి జ్యూరీని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

Follow Us