
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ ఉగాది కానుకగా తీపికబురు అందించింది. ఉగాది రోజున ఇల్లు లేని వారికి కొత్త వాటిని మంజూరు చేయనుంది. ఈ మేరకు లక్ష టిడ్కో ఇళ్లను ఉగాది రోజున పేదలకు పంపిణీ చేయనున్నట్లు అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ నెల 18న లక్ష మందికి ఇళ్లను అందించనున్నట్లు వెల్లడించారు. జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, ఈ మేరకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణం అందినట్లు తెలిపారు. అటు 2028 నాటికి పట్టణాల్లోని ప్రజలందరికీ తాగునీరు అందిస్తామని, ఆ దిశగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందని వివరించారు. అసెంబ్లీలో మున్సిపల్ శాఖ సాధారణ బడ్జెట్ డిమాండ్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు.
గతంలో 5 లక్షల టిడ్కో ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ముందుడుగు వేయగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని 2.65 లక్షలకు తగ్గించింది. వాటికి రంగులు మార్చి ఇల్లు కట్టకుండానే బిల్లులు వేసి భారీగా అవకతవకలు, అక్రమాలకు పాల్పడిందని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని, తాము తిరిగి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అటు రాష్ట్రంలో పట్టణ జనాభా పెరుగుతోంది. ప్రస్తుతం 36 శాతం మంది జీవిస్తుండగా.. 2047 నాటికి 60 శాతానికి చేరుకునే అవకాశముంది. దీంతో దీనికి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టినట్లు నారాయణ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలైన తాగునీరు, రోడ్లు, ఇల్లు, ఆరోగ్య సేవలు, చెత్త సేకరణ వంటి వాటిపై ఫోకస్ పెట్టినట్లు వివరించారు.
అటు పీఎం ఆవాస్ యోజన పథకం కింద లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వీరికి కూడా ఉగాది నాటికి ఇళ్లను కేటాయిస్తామని ఇటీవల అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే స్థలం లేనివారికి ప్రభుత్వమే ఉచితంగా స్థలం కేటాయించి ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. పీఎం ఆవాస్ యోజన పధకం కింద లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను గుర్తించింది. ఇటీవల మరోసారి దరఖాస్తులను పున:పరిశీలించారు. జాబితా సిద్దం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే రాష్ట్ర ప్రభుత్వం జాబితాను విడుదల చేయనుంది. పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిసి పేదలకు రాష్ట్రంలో ఇళ్లు నిర్మించేందుకు కూటమి సర్కార్ సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే.