Andhra Pradesh: అద్దె భవనాల్లో గ్రామ సచివాలయాలను నిర్వహిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వరుస షాక్ లిస్తున్నారు యాజమానులు. అద్దెలు చెల్లించడం లేదంటూ తాళం వేసి సచివాలయ ఉద్యోగులను ఆరుబయట నిల్చోబెట్టారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వరుసగా షాక్ లు ఇస్తున్నారు గ్రామ సచివాలయ యాజమానులు. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సచివాలయ ఉద్యోగులకు అవమానం జరిగింది. యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో గ్రామ సచివాలయానికి అద్దె చెల్లించడం లేదంటూ యాజమాని తాళం వేశాడు. దీంతో సచివాలయ ఉద్యోగులు చేసేందేం లేక ఆరుబయట చెట్టుకింద వేచి ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా అద్దె చెల్లించకపోవడంతో తాళం వేశానని చెబుతున్నాడు భవన యాజమాని చిమటా వెంకట రాములు.
ఇలాంటి ఘటనే రీసెంట్ గా వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామంలో జరిగింది. పదినెలలుగా అద్దె చెల్లించడం లేదంటూ యాజమాని గురమ్మ, ఆమె భర్త ముక్కా పుల్లారెడ్డి సచివాలయం భవనానికి తాళం వేశారు. అద్దె గురించి అధికారులను అడిగితే సంబంధం లేదంటూ సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె మీద తమ కుటుంబ పోషణ జరుగుతుందని.. పది నెలలుగా చెల్లించకపోవడంతో కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది గురమ్మ. తమ సమస్య పరిష్కారం కావాలంటే తాళం వేయక తప్పలేదని చెబుతున్నారు సచివాలయ భవన యాజమానులు.