
మేడే సందర్భంగా కార్మికులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అండగా ఉంటున్నట్లు చెప్పారు. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికుడి పెళ్లికి రూ.25 వేలు ఆర్ధిక సాయం చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే కార్మికుడి కుమార్తెకు కూడా ఈ పథకం వర్తిస్తుందని, వారికి సంతానం కలిగితే రూ.20 వేలు అందిస్తామని వెల్లడించారు. ఇక భవన నిర్మాణ కార్మికులు సహజ మరణం పొందితే కుటుంబానికి రూ.60 వేల పరిహారంతో పాటు అంత్యక్రియలకు రూ.20 వేలు ఇస్తామన్నారు.
మేడే సందర్భంగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కార్మికుల కోసం లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మొదటి విడతలో నగరాలు, పట్టణాల్లో 15 చోట్ల వీటిని ఏర్పాటు చేస్తామని, విడతల వారీగా వీటిని విస్తరిస్తామని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా లేబర్ అడ్డాలు ఉంటాయని, కార్మికుల్లో స్కిల్స్ పెంచేందుకు ట్రైనింగ్ అందిస్తామన్నారు. కార్మికులకు పని లేని రోజు ఈ లేబర్ అడ్డాలలో నైపుణ్యం పెంచేలా ఉచితంగా శిక్షణ కల్పిస్తామన్నారు. అత్యాధునిక పనిమట్లతో 15 చోట్ల వీటిని త్వరలో నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు.
గుంటూరు, కర్నూలు, అమరావతి, శ్రీసిటీ, అచ్యుతాపురంలో కొత్తగా ఈఎస్‌ఐ ఆస్పత్రులను నిర్మించనున్నట్లు చంద్రబాబు వివరించారు. కార్మికులందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్మికుల పిల్లలందరూ పరిశ్రమలు స్థాపించాలనే లక్ష్యంతో పనిచేయాలని, అందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఇక వివాదాలను పరిష్కరించుకునేందుకు రాష్ట్రంలో నాలుగు కార్మిక కోర్టులు అందుబాటులో ఉన్నట్లు గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ది దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టీడీపీ పార్టీ గుర్తులోనే నాగలి, కార్మికుడు లాంటి చిహ్నాలు ఉన్నాయన్నారు. గతంలో ఆగిపోయిన కార్మిక సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ జీవం పోసిందని చంద్రబాబు అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 88 లక్షల మంది అసంఘటిత కార్మికుల కోసం రూ.615 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన కార్మికులు, యజమాన్యాలను సత్కరించారు.