Amzath Basha Shaik: పేరుకేమో ఉప ముఖ్యమంత్రి.. రిబ్బన్‌ కట్టింగుల్లో తప్ప.. ఎక్కడా కనిపించరు..!

|

Apr 01, 2022 | 3:58 PM

పేరు గొప్ప .. ఊరు దిబ్బ అనే సామెత మీకు తెలుసా? ఇప్పుడు ఏపీలో ఆ నాయకుడి తీరు అలాగే ఉంది మరి. పేరుకేమో... ఉప ముఖ్యమంత్రి. రిబ్బన్‌ కట్టింగుల్లో తప్ప.. ఎక్కడా కనిపించరు. ప్రజలకు ఆమడ దూరంలో ఉంటారు... ఆడంబరాలకు మాత్రం అందరికాన్ని ముందుంటారు.

Amzath Basha Shaik: పేరుకేమో ఉప ముఖ్యమంత్రి.. రిబ్బన్‌ కట్టింగుల్లో తప్ప.. ఎక్కడా కనిపించరు..!
Amzath Basha Shaik Bepari
Follow us on

Amzath Basha Shaik: పేరు గొప్ప .. ఊరు దిబ్బ అనే సామెత మీకు తెలుసా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఆ నాయకుడి తీరు అలాగే ఉంది మరి. పేరుకేమో… ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister). రిబ్బన్‌ కట్టింగుల్లో తప్ప.. ఎక్కడా కనిపించరు. ప్రజలకు ఆమడ దూరంలో ఉంటారు… ఆడంబరాలకు మాత్రం అందరికాన్ని ముందుంటారు. పుయ్‌.. పుయ్‌.. అని సైరన్‌ ఏసుకుని, వెనకాల ఎస్కార్ట్‌ వేసుకుని రావడమే తప్ప.. చేసిన పని ఒక్కటీ లేదని జనం గుసగుసలాడుకుంటున్నారట. ఇంతకీ ఎవరా గొప్ప నేత?

డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా తీరుపై జనం అసహనం! వైఎస్‌ కుటుంబంతో సాన్నిహిత్యం కలిసొచ్చిందా? పదవి దక్కినా.. ప్రజలు మన్ననలు దక్కడం లేదా? ఇదే అవునంటున్నారు కడప జిల్లా నేతలు. మొదట్లో కడప కార్పొరేటర్‌… ఆ తర్వాత అదృష్టం కలిసొచ్చింది. వైఎస్‌ కుటుంబంతో సాన్నిహిత్యం మరింత లక్‌ కలిసొచ్చేలా చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి దగ్గరి వ్యక్తిగా పేరున్న అంజాద్‌ భాషా.. అనూహ్యంగా అందలమెక్కేశారు. రెండుసార్లు కడప అసెంబ్లీ సెగ్మెంగ్‌లో విజయం సాధించి.. మైనార్టీ కోటాలో డిప్యూటీ సీఎం అయిపోయారు. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని.. అత్యున్నత పదవిని దక్కించుకున్న అంజాద్‌.. ఆ స్థాయిలో జనాల మన్ననలు పొందడంలో మాత్రం విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది.

పేరుకే పెద్ద పదవి తప్ప.. నియోజకవర్గ ప్రజలకు సార్ చేస్తున్నదేమీ లేదట. రిబ్బన్ కటింగ్ పోగ్రాములకు తప్ప ఎక్కడా కనిపించడం లేదట. ప్రజలకు ఆమడ దూరంలో ఉండి… ఆరంభాలకు, ఆడంబరాలకు ముందుంటున్నారట. సైరన్ కారేసుకుని దూసుకెళ్తుంటారు తప్ప.. జనం వెతల్ని కళ్లారా చూడలేకపోతున్నారని స్థానికంగా గుసగుసలు మొదలయ్యాయి. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా.. కడప నగరానికి అంజాద్‌ భాషా చేసిన అభివృద్ది మాత్రం గుండు సున్నా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మైనారిటీశాఖ కూడా ఆయనదగ్గరే ఉంది.. అలాగని మైనారిటీలకు ఒక్క పనిచేశారా? అంటే అదీ లేదు. దీన్ని బట్టి అంజాద్ భాయ్ పనితనం ఏంటో అర్దం చేసుకోవచ్చు.

2014 లో మైనారిటీ కోటాలో లక్కీగా కడప శాసనసభ సీటు దక్కించుకున్న అంజాద్‌.. జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచారు. 2019 లోనూ ఫ్యాన్‌ గాలిలో కొట్టుకొచ్చేశారు. అదే కోటాలో అనూహ్యంగా డిప్యూటి సీఎం అయిపోయారు. అయితే, తమ గోడు వినని ఎమ్మెల్యే.. డిప్యూటీ సీఎం అయితే ఏంటి? ఏకంగా సీఎం అయితే మాకేంటి? అంటున్నారట కడప నగర ప్రజలు. ఎమ్మెల్యే తీరుపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. 2014 మొదలు.. నగరంలో ఈ అభివృద్ది చేశానని చెప్పుకొనే పరిస్థితి అంజాద్‌కు లేదంటే అతిశయోక్తి కాదు. పోనీ, డిప్యూటి సియం హోదాలో రాష్ట్రంలోని ఇతర జిల్లాలయినా తిరిగారా? అంటే అదీ లేదు. అసలు ఇలాంటి నేత మనకు అవసరమా? అనే ఫీలింగ్‌లో కడప ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి టాటా, బైబై, సీరియో అనేందుకు రెఢీ అవుతున్నారట.

వైసీపీ మీద అభిమానం ఉన్నా… కడప ఎమ్మెల్యే అంజాద్‌పై కడప ప్రజలు చాలా కోపంగా ఉన్నారని స్పష్టమవుతోంది. సమస్యలు చెప్పుకొనేందుకు వెళితే.. తప్పించుకుని తిరిగే నేత మాకవసరం లేదంటున్నారట జనం. ఏటా కడప నగరాన్ని ముంచెత్తే బుగ్గవంక ముప్పు సమయంలోనూ.. నామ్‌కే వాస్తే వచ్చి వెళతారు తప్ప.. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని నగరజనం గుర్రుగా ఉన్నారట. జిల్లా మంత్రి అయ్యుండి రాజంపేట వరదలవైపు కన్నెత్తి కూడా చూడలేదంటే అంజాద్ భాయ్ పనితీరేంటో ఈజీగా అర్థమవుతోంది. భాషా భాయ్ పై పార్టీ నేతలు కూడా గుర్రుగానే ఉన్నారట. ప్రజల సమస్యలు పక్కన పెట్టారు సరే, పార్టీలో ఉన్న క్యాడర్ నైనా కాపాడు కుంటున్నారా అంటే అదీ లేదు. అసలాయన తమను కలిసిన ధాఖలాలే లేవని పార్టీ ద్వీతియ శ్రేణి నాయకులు వాపోతున్నారు. ఈ సారి కనుక అంజాద్ బాషాకు సీటిస్తే.. కచ్చితంగా గెలుపుకోసం పోరాడాల్సిందేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా, అంజాద్‌ భాషా తీరు మారకుంటే.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి హవా ఉన్నా విజయం కష్టమేనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.

—- సుధీర్, టీవీ9 ప్రతినిధి, కడప. 

Read Also…   Bhagwant Mann: పంజాబ్‌ తీర్మానంతో మళ్లీ మొదలైన వివాదం.. ఇప్పటికైనా ఆ సమస్య తీరుతుందా..