Andhra Pradesh:రవాణాశాఖలో అవకతవకలపై సీఎం జగన్ (CM Jagan) సీరియస్ అయ్యారు. ఇటీవల ట్రాన్స్‌ఫర్ అయిన రవాణాశాఖ కమిషనర్ రాజబాబు తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, ఇటీవల జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. అలాగే, రవాణాశాఖ మాజీ కమిషనర్ రాజబాబు జారీ చేసిన వివాదాస్పద ఓడీ… ఆన్ డిప్యూటేషన్ జీవో 23ని తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. గత రెండు నెలల్లో రాజబాబు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ సమీక్షించాలన్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో రవాణాశాఖపై రివ్యూ నిర్వహించారు కొత్త కమిషనర్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు. మాజీ కమిషనర్ రాజబాబు జారీ చేసిన ఓడీలను రద్దు చేశారు. ఓడీల రద్దుతో ఆన్ డిప్యూటేషన్‌పై వెళ్లిన 23మంది అధికారులు పాత స్థానాల్లోనే కొనసాగనున్నారు.
కాగా సస్పెన్షన్ వేటుపడిన రవాణాశాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు విషయంలో గందరగోళం కొనసాగుతోంది. ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టిన డీలర్లకు సహకరించాడంటూ అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ప్రసాదరావును సస్పెండ్ చేసిన ప్రభుత్వం. అయితే సస్పెన్షన్ వేటుపడినా విధుల్లో కొనసాగుతుండటం చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే, కొత్త కమిషనర్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు నిర్వహించిన రివ్యూ మీటింగ్‌కి… సస్పెండైన అదనపు కమిషనర్ ఎస్‌ఏవీ ప్రసాదరావు కూడా అటెండ్ కావడం.. అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..