Andhra: మహిళా క్రికెటర్‌ శ్రీచరణికి భారీ నజరానా ప్రకటించిన ఏపీ సర్కార్.. రూ.2.5 కోట్ల నగదుతో పాటు

భారత మహిళల క్రికెట్ జట్టు 2025 వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. నవీ ముంబైలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి, తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంలో కడపకు చెందిన తెలుగమ్మాయి శ్రీచరణి కీలక పాత్ర పోషించింది. ఆమె బౌలింగ్‌తో 14 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ముంబై నుంచి శుక్రవారం గన్నవరం చేరుకున్న శ్రీచరణి.. నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను కలిసింది..

Andhra: మహిళా క్రికెటర్‌ శ్రీచరణికి భారీ నజరానా ప్రకటించిన ఏపీ సర్కార్..  రూ.2.5 కోట్ల నగదుతో పాటు
Cricketer Sri Charani

Edited By: Ram Naramaneni

Updated on: Nov 07, 2025 | 5:20 PM

మహిళా ప్రపంచ కప్‌లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్రాకు చెందిన క్రీడాకారిణి శ్రీ చరణికి రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. తొలతు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమెకు..  ఏసీఏ ఆధ్వర్యంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు వంగలపూడి అనిత, సవిత, సంధ్యారాణి స్వయంగా హాజరై పుష్ప గుచ్ఛాలతో శ్రీ చరణిని ఆహ్వానించారు. జట్టు విజయంలో ఆమె పోషించిన భూమిక రాష్ట్రానికి గర్వకారణమని మంత్రులు పేర్కొన్నారు. ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు, ట్రెజరర్ దండమూడి శ్రీనివాస్, షాప్ చైర్మన్ ఎ. రవినాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నేరుగా సీఎం నివాసానికి వెళ్లి.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‌ను శ్రీ చరణి కలిశారు. ఈ సందర్భంగా శ్రీ చరణి మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన టీ షర్ట్‌ను ముఖ్యమంత్రికి అందించారు. దానిని ఆప్యాయంగా స్వీకరించిన ముఖ్యమంత్రి శ్రీచరణి బృందం భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు ఆమెను అభినందిచడంతో పాటు భారీ నజరానా ప్రకటించారు. 2.5 కోట్ల నగదు పురస్కారం, కడపలో 1000 చదరపు గజాల స్థలం కేటాయింపుతో పాటు.. గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు. భవిష్యత్‌లో తను మరిన్ని విజయాలు సాధించి.. యువతకు స్పూర్తిగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు.

తర్వాత మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఏసీఏ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ చరణి మాట్లాడుతూ ఏసీఏ నాకు అన్ని విధాలా తోడుగా నిలిచిందన్నారు. ప్రధాని మోదీని కలిసినప్పుడు.. భవిష్యత్‌ కార్యాచరణపై సలహాలిచ్చారని తెలిపారు. అందరి అభిమానం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని.. మున్ముందు ఇంకా చాలా చేయాల్సి ఉందని శ్రీ చరణి చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.