ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా యస్. రాయవరం మండలం పెదఉప్పలంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. వరాహనదిలో కొందరు వ్యక్తులు ఎడ్లబళ్లకు ఇసుక తవ్వుతుండగా.. రాయికి పాదంతో కూడిన ఆకారం కనిపించింది. దీంతో గ్రామస్తులను పిలిచి ఇసుకలో కప్పి ఉన్న రాతి ప్రతిమను వెలిక తీయగా.. అది నూకాంబిక అమ్మవారి విగ్రహంగా గుర్తించారు. సుమారు 500 కిలోల బరువున్న రాయిపై అమ్మవారి విగ్రహం అందంగా చెక్కి ఉంది. నది గర్భంలో పురాతన విగ్రహం బయటపడటంతో.. సమప ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని.. పూజలు చేశారు. తమ ప్రాంతాన్ని సంరక్షించడానికి అమ్మవారే బయటకు వచ్చారని గొప్పగా చెబుతున్నారు. భక్తులు సంఖ్య పెరగడంతో… బసవపాడు గ్రామానికి చెందిన పలువురు భక్తులు అమ్మవారు బయటపడిన ప్రదేశంలో చలువ పందిరి వేశారు. భక్తులకు నీడనిచ్చేలా టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ నెలకుంది.
కాగా విషయం పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో పరసర గ్రామాలైన పెదఉప్పలం, లింగరాజుపాలెం, వెంకటాపురం, అగ్రహారం, ఎస్.రాయవరం శివారు అగ్రహారం, వమ్మవరం, ఎస్.రాయవరం తదితర గ్రామాలకి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నది వద్దకు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో నూకాంబిక అమ్మవారిని భక్తులు ఇలవేల్పుగా కొలుచుకుంటారు. మండల దీక్ష చేపట్టి మాలలు ధరిస్తారు. నూకాంబిక అమ్మవారు తొమ్మిది శక్తి రూపాలలో ఒకటిగా చెబుతారు. ఉత్తరాంధ్రలో చాలా చోట్ల ఈ అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. అయితే గవరపాలెంలో ఉన్న దేవస్థానానికి కొత్త అమావాస్య నాడు, ఉగాదికి ఒకరోజు ముందు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు చేస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…