Anakapalli: ఆమె ఓ యాంకర్.. పగలంతా హోస్టింగ్.. రాత్రయితే..
అనకాపల్లి జిల్లాలో ఓ టీవీ యాంకర్ గెద్దాడ మేరీ అలియాస్ మధుశ్రీ దొంగతనం కేసులో అరెస్టయ్యారు. ఆమె భర్త స్నేహితుడు లోకనాథ్‌తో కలిసి ఇళ్లల్లో చోరీలు చేసి, బంగారం, వెండి అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగల జంట పగటిపూట ఇళ్లను రెక్కీ చేసి, రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి దోచుకునేది.

అనకాపల్లి జిల్లాలో ఒక టీవీ యాంకర్ దొంగతనాలకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. యాంకర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే కలతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన గెద్దాడ మేరీ అలియాస్ మధుశ్రీ, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరాల బాట పట్టింది. విశాఖపట్నం వడ్లపూడి కనతి ప్రాంతానికి చెందిన ఆమె, అందమైన మాటలతో స్టేజ్ షోలు చేస్తూనే, లోపల నేరపూరిత ఆలోచనలతో రగిలిపోయింది. ఈ క్రమంలో ఆమెకు తన భర్త గణేశ్ స్నేహితుడైన కాండ్రేగుల లోకనాథ్ పరిచయమయ్యాడు. లోకనాథ్ ఒక సామాన్యుడు కాదు. అతను పాత నేరస్థుడు, రౌడీషీటర్ అని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌గా పనిచేస్తూనే గంజాయి కేసులు, కొట్లాటల్లో ఆరితేరిన లోకనాథ్‌తో మేరీ జతకట్టింది. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఈ ఇద్దరూ ఇళ్లల్లో చోరీలు చేయాలని పథకం వేశారు.
వీరి దొంగతనం పద్ధతి చాలా పక్కాగా ఉండేది. నెల రోజుల క్రితమే అనకాపల్లిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్న ఈ జంట, పగటిపూట వీధుల్లో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించేది. రాత్రి వేళల్లో లోకనాథ్ ఇంటి తాళాలను పగలగొట్టి బయట కాపలాగా ఉండేవాడు. మేరీ మాత్రం నిర్భయంగా లోపలికి వెళ్లి బీరువాలు గుల్ల చేసి, బంగారం, వెండిని అపహరించేది. చోడవరం కోటవీధిలో మొదలైన వీరి నేరాల పర్వం అనకాపల్లి గాంధీనగర్ మీదుగా పిసినికాడ గ్రామం వరకు సాగింది. ఎక్కడా అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో దోపిడీలు చేశారు. అయితే, వరుస దొంగతనాలతో అనకాపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక ప్రాంతంలో యాంకర్ మేరీ కదలికలు పోలీసులకు అనుమానం కలిగించాయి. సాంకేతిక ఆధారాలు, నెట్‌వర్క్ డేటా సహాయంతో ఈ దొంగల జంటను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో వీరు చేసిన నేరాలు వెలుగులోకి వచ్చాయి. వీరి నుంచి ఒక జత మెట్టెలు, ఒక జత చెవిలీలు, ఒక జత జారాలు, చెవిదిద్దులు, ఒక చాపబిళ్ళ, చైన్, రెండు ఉంగరాలు, ఒక బంగారపు తాలి వంటివి కలిపి ఒక క్రైమ్‌లో సుమారు 50.08 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరో క్రైమ్‌లో 5.830 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. ఇప్పటివరకు మూడు దొంగతనాలు చేసినట్లు వీరు ఒప్పుకున్నారు. మేరీది చోడవరం స్వగ్రామం కాగా, లోకనాథ్ పెందుర్తికి చెందినవాడు. వీరి మునుపటి నేర చరిత్రను పరిశీలిస్తే, టౌన్ పోలీస్ స్టేషన్, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్, చోడవరంలో ఇప్పటికే వీళ్ల మీద దొంగతనం కేసులు, ఒక ఎన్‌డిపిఎస్ కేసు, ఒక 324 కేసు నమోదైనట్లు తెలిసింది. విలాసాలకు అలవాటు పడి, కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటే చివరికి జైలుకే వెళ్తారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం యాంకర్ మేరీ అలియాస్ మధుశ్రీ జైలులో ఊచలు లెక్కిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
