Anantapur: చెడిపోయిన పాని పూరి.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన వ్యవహారం..రచ్చ రచ్చ

|

Jan 16, 2022 | 8:57 AM

Anantapur: కల్తీ ఆహారం, చెడిపోయిన తినుబండారాలు అమ్ముతున్నారని ప్రశ్నించిన ఒక మెడికోను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మహిళల చేత కొట్టించిన సంఘటన అనంతపురం(Aanathpur) నగరంలో..

Anantapur: చెడిపోయిన పాని పూరి.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన వ్యవహారం..రచ్చ రచ్చ
Pani Puri In Anantapur
Follow us on

Anantapur: కల్తీ ఆహారం, చెడిపోయిన తినుబండారాలు అమ్ముతున్నారని ప్రశ్నించిన ఒక మెడికోను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మహిళల చేత కొట్టించిన సంఘటన అనంతపురం(Aanathpur) నగరంలో కలకలం రేపింది. ఈ సంఘటనకు అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ వేదికైంది. నగరానికి చెందిన దీపక్ వెంకట్ కృష్ణారెడ్డి(Deepak venkat krishna reddy) అనే మెడికల్ విద్యార్థి నగరంలోని పోలీస్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి పానీపూరి సెంటర్ (Pani Puri Centre) కు వెళ్ళాడు. అక్కడ పానీపూరి పార్సెల్ తీసుకొని ఇంట్లో దానిని ఓపెన్ చేసి చూడగా చెడిపోయినట్టు వాసన వచ్చింది. దానిని గమనించినప్పుడు చాలా రోజుల క్రితం తయారుచేసినది గుర్తించాడు. ఇదే విషయాన్ని తిరిగి పని పూరి సెంటర్ వద్దకు వెళ్లి ప్రశ్నించగా అక్కడున్న మహిళలు దాడి చేశారు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్ఐ అల్లా బకాష్ అక్కడికి చేరుకొని మెడికల్ స్టూడెంట్ ను స్టేషన్ కు తీసుకెళ్ళారు. జరిగిన సంఘటనపై ఆరా తీయకుండా పానీ పూరి సెంటర్ మహిళల చేత మెడికోపై దాడి చేయించారు. అనంతరం ఎస్సై కూడా మెడికో పై దాడి చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి సిఐ జాకీర్ హుస్సేన్ ని ప్రశ్నించగా.. ఆయన మరింత నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో మీడియా ప్రతినిధులు జరిగిన సంఘటన పై వివరణ కోరగా ఎస్ఐ అల్లా బకాష్ , సిఐ జాకీర్ హుస్సేన్ దురుసుగా ప్రవర్తించారు. ఇంతలో బాధిత కుటుంబ సభ్యులు స్థానిక మెడికల్ కళాశాల విద్యార్థులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. 5 గంటల గా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా సెక్షన్స్ లేవంటూ చెబుతున్నారు. మరోవైపు పానీ పూరి సెంటర్ తో పాటు పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను మీడియాకు చూపకుండా దాస్తున్నారు. అసలు పానీ పూరి సెంటర్ నిర్వాహకుల పైన పోలీసులకు ఎందుకు అంత ప్రేమ అన్నది అర్థం కాని పరిస్థితి. ఒక మెడికల్ స్టూడెంట్ ను స్టేషన్లో కొట్టడం ఏంటని మెడికోలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మీడియా ద్వారా సమాచారం అందుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ రంగంలోకి దిగారు. పానీ పూరి సెంటర్ లో విక్రయిస్తున్న వాటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపుతున్నట్లు తెలిపారు. మొత్తం మీద పోలీసుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం…

లక్షికాంత్, అనంతపురం జిల్లా, టీవీ9 తెలుగు

 

Also Read:   చాణుక్యుడు చెప్పిన ఈ 4 విషయాలను పాటిస్తే.. జీవితంలో ఏర్పడే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది