
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా పోస్ట్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలకు సహజసిద్ధ అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వైజాగ్ పై మనసు పారేసుకున్నారు. అది కూడా ప్రాచుర్యం పొందిన ఆర్కే బీచ్ కాదు.. బ్లూ ఫ్లాగ్ బీచ్ గా పేరుగాంచిన రుషికొండ బీచ్ అంతకంటే కాదు.. పోనీ భీమిలి బీచ్.. యారాడ బీచ్ అంటే.. అవి కూడా కాదు. ఆనంద్ మహేంద్రా విశాఖలోని.. గంగవరం బీచ్ పై ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు అందరిలో ఆలోచింపజేస్తుంది. గంగవరం బీచ్ ను అద్భుతంగా వర్ణిస్తూ.. ప్రశంసల కురిపించారు. బీచ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన మనసులోని భావాన్ని చెప్పారు.
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన తీరప్రాంత ప్రదేశాలలో ఇది ఎందుకు ఒకటిగా లేదు? ఇది విశాఖపట్నం సమీపంలోని గంగవరం బీచ్. ఇది మామూలు ఉష్ణమండల బీచ్‌లా ఉండదు. ఇక్కడ.. గాలికి ఊగే కొబ్బరి చెట్ల వరుసలు గానీ, పోస్ట్‌కార్డులో కనిపించే అందమైన దృశ్యాలు గానీ లేవు. దానికి బదులుగా, ఎత్తైన రాతి కొండలు, చరిత్రపూర్వ కాలం నాటి అందం ఇక్కడ కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే.. ఇలాంటి సహజ సౌందర్యమే నన్ను మరింత ఆకర్షిస్తుంది. ఇది కేవలం విశ్రాంతి తీసుకోవడానికే కాకుండా, ఆత్మపరిశీలన చేసుకోవడానికి కూడా మిమ్మల్ని ఆహ్వానించే ప్రదేశం.’ అని బీచ్ ప్రకృతి సహజసిద్ధ సౌందర్యాన్ని ఆయన మాటల్లో వర్ణించారు.
అంతేకాదు.. విశాఖ అభివృద్ధిని ప్రకృతితో అనుసంధానిస్తూ ఆసక్తికరంగా కామెంట్ పోస్ట్ చేశారు. ‘ఇక్కడ ఒక ఆసక్తికరమైన వైరుధ్యం ఉంది.. ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలు హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి వైజాగ్‌కు వస్తున్నారు. కానీ ఈ ఫోటోలను చూస్తుంటే.. ఇక్కడి ప్రకృతి లక్షల సంవత్సరాల క్రితమే హైపర్‌స్కేలింగ్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది! వైజాగ్ స్పష్టంగా ఒక ప్రధాన టెక్నాలజీ కేంద్రంగా మారే మార్గంలో ఉంది.
కానీ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన తీరప్రాంత విహార ప్రదేశాలలో ఒకటిగా మారే సామర్థ్యం కూడా దీనికి ఉందని నేను భావిస్తున్నాను. స్పష్టంగా, వైజాగ్‌లో ఒకటి కంటే ఎక్కువ రకాల అద్భుతమైన అభివృద్ధి కథలు ఆవిష్కృతమవుతున్నాయి.. అని తన భావాన్ని విశ్లేషించి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఆదివారం నాడు తన ‘సండే వాండరర్’ సిరీస్‌లో భాగంగా ఆనంద్ మహీంద్రా గంగవరం బీచ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు అందరి దృష్టి ఆ బీచ్ వైపు ఆకర్షిస్తుంది. ఆనంద్ మహింద్రా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. వైజాగ్లో ఆ బీచ్ ఎక్కడుందని విషయంపై సెర్చ్ చేస్తున్నారు సోషల్ మీడియా ఫాలోవర్స్. ఇండియా ఎస్తెటికా అందించిన ఈ ఫొటోల్లో రంగులు కొంచెం పెంచి ఉండొచ్చు.. కానీ అక్కడి ప్రకృతి దృశ్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచదని ఆయన తన పోస్ట్ ను ముగించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.