ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు శ్రవణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్ 11న శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కాగా మంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఏదైనా చట్టసభల్లో ఆయన సభ్యుడిగా ఎంపికవ్వాలి, లేదంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 10తో ఆరు నెలల గడువు ముగుస్తున్న నేపథ్యంలో, ఇప్పటివరకు శ్రవణ్ ఏ సభల్లోనూ సభ్యుడు కాకపోవడంతో.. ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్.. సీఎం చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు రాజ్‌భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్‌కు సమాచారం అందించారు. మరోవైపు ఈ విషయంపై శ్రవణ్ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.