ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు భద్రత కింద 97మంది సెక్యూరిటీని కొనసాగించాలని.. అలాగే ఆయన కాన్వాయ్‌లో జామర్ వాహనం కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ కింద ఫైవ్ ప్లస్ టు సెక్యూరిటీని ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. కాగా ట్రాఫిక్ క్లియరెన్స్ అంశాన్ని మాత్రం హైకోర్టు ప్రస్తావించలేదు. ఇక మాజీ సీఎం హోదాలో చంద్రబాబుకు సీఎస్‌వో ఒకరు సరిపోతారని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్‌లో ఎన్ఎస్జీ కమెండోలు ఉండాలో లేక స్థానిక పోలీసులు ఉండాలో వారే తేల్చుకోవాలని హైకోర్టు వెల్లడించింది. ఇందుకోసం మూడు నెలల సమయాన్ని ఇచ్చింది.
కాగా జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబుకు భద్రతను కుదించింది. ఆయన భద్రతకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న వారిలో దాదాపు 15మంది సిబ్బందిని ఏపీ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా సెక్యూరిటీని తగ్గించింది. ఇక చంద్రబాబు సెక్యూరిటీపై ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలినట్లైంది.