CM Chandrababu: అమరావతికి మళ్లీ ప్రాణ ప్రతిష్ఠ.. మూడేళ్లలో పూర్తిచేస్తాం: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

|

Oct 19, 2024 | 4:30 PM

రాజధాని అమరావతి పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతికి మళ్లీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నామన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని.. పేర్కొన్నారు.

CM Chandrababu: అమరావతికి మళ్లీ ప్రాణ ప్రతిష్ఠ.. మూడేళ్లలో పూర్తిచేస్తాం: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu
Follow us on

అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభమైంది. రాయపూడిలో పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న అమరావతి నిర్మాణ ఏజెన్సీ సీఆర్డీయే కార్యాలయ పనులను చంద్రబాబు మొదలుపెట్టారు. 2018లో 160 కోట్ల రూపాయలతో CRDA ఆఫీస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు నిలిచిపోయాయి. ఆగిపోయిన CRDA కార్యాలయ పనులు తిరిగి ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఏడంతస్థుల భవన నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారు. ఇటీవల జరిగిన సీఆర్దీఎ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్న సర్కార్.. వెంటనే అమలు చేసింది. రాబోయే రోజుల్లో విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని.. కర్నూలులో హైకోర్టు బెంచ్‌, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. రాజధాని అమరావతి కోసం రైతుల్ని ఒప్పించి వేల ఎకరాల భూమిని సేకరించడం ఒక చరిత్ర అన్నారు. మళ్లీ అమరావతికి పూర్వ వైభవం కచ్చితంగా వస్తుందన్నారు. గత ఐదేళ్లలో కూడా అమరావతికి అడ్డుంకులు సృష్టించారని.. రాజధాని ప్రాంత మహిళా రైతుల చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అమరావతికి టాప్ యూనివర్శిటీలు, 10 టాప్ బెస్ట్ స్కూల్స్, 10 టాప్ బెస్ట్ కంపెనీలు రావాలన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్ర తిరగరాయడంలో భాగంగా ఈ సభ జరుగుతోందన్నారు. హైదరాబాద్‌ నుంచి పాలన సాగిస్తే అమరావతి డెవలప్‌కాదని భావించామని.. సైబరాబాద్‌ నిర్మించిన ఘనత టీడీపీదేనన్నారు. హైదరాబాద్‌లో రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు మొదలుపెడితే విమర్శించారని.. కానీ ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. మొత్తం 54వేల ఎకరాల భూమి అమరావతికి సేకరించామని.. గత ప్రభుత్వం అమరావతి రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు. వీరోచితంగా పోరాడి మహిళా రైతులు రాణిరుద్రమలుగా కనిపించారన్నారు. ఉద్యమాలతో ప్రజలను చైతన్యపరిచారని.. ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేసిందని.. అయినప్పటికీ.. వెనకడుగు వేయకుండా పోరాడన్నారు. అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నామని.. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మాణంలో స్పీడు పెంచుతామని తెలిపారు. గ్రీన్‌సిటీగా అమరావతిని నిర్మాణం చేస్తామని.. మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేయాలని సూచించారు. తన కష్టాలు చూసి వరుణదేవుడు కూడా స్పందించి అండగా ఉన్నాడంటూ సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో టాప్‌10 విశ్వవిద్యాయాలు అమరావతికి వస్తున్నాయని.. బిట్స్‌ పిలాని కూడా యూనివర్సిటీ పెట్టడానికి అంగీకరించిందన్నారు. టాప్‌ హోటల్స్‌, టాప్‌ హాస్పిటల్స్‌ కూడా అమరావతికి వస్తున్నాయన్నారు. రూ.40వేల కోట్లతో 50 పనులకు టెండర్లు పిలిచామని.. వైసీపీ ప్రభుత్వం కారణంగా రూ.7వేల కోట్ల అదనపు భారం ఏర్పడిందన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..