ఏపీకి కొత్త సీఎం కాబోతున్న వైఎస్ జగన్ నేటి కడప జిల్లా పర్యటన రేపటికి వాయిదా పడింది. ఇవాళ కడపకు వెళ్లి అక్కడి నుంచి సాయంత్రం తిరుపతికి వెళ్లాలని భావించినా.. ఇప్పుడు ఆ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. సాయంత్రం వరకు తాడేపల్లిలోనే అధికారులతో సమావేశాలు, సమీక్షలు జరపనున్న జగన్.. అక్కడి నుంచి ఇవాళ తిరుపతికి వెళ్లి, బుధవారం కడపకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
మారిన షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 5గంటలకు జగన్ ప్రత్యేక విమానంలో రేణిగుంట వెళ్తారు. అక్కడి నుంచి తిరుమలకు చేరుకొని, రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్న జగన్.. ఆపై రేణిగుంటకు వచ్చి, ప్రత్యేక విమానంలో కడపకు వెళ్లనున్నారు. కడప దర్గాలో ప్రార్ధనలు ముగించుకొని, పులివెందులకు వెళ్లి సీఎస్‌ఐ చర్చిలో ప్రార్ధనలు చేయనున్నారు. ఆ తరువాత ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించి.. ఆపై మళ్లీ తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఆ తరువాత 30న విజయవాడలో తన ప్రమాణస్వీకారాన్ని చేయనున్న జగన్.. కేసీఆర్, గవర్నర్ నరసింహన్‌తో కలిసి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు.