ప్రస్తుతం రాష్ట్రం రూ.66వేల కోట్ల ఆర్థిక లోటులో ఉందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక స్థితి గతులపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. 2004-2009 వరకు ఏపీ స్థూల ఉత్పత్తి 12శాతం పెరిగిందన్నారు. 2014-19 మధ్య ఏపీకి గడ్డు కాలం నడిచిందని.. జాతీయసగటుతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి తక్కువగా నమోదైందని చెప్పారు. 2014-15లో మైనస్ వృద్దిరేటు నమోదైందని.. అప్పులు పెరిగిపోయాయని అన్నారు. 2013-2018 కాలంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని తెలిపారు.
ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్ ప్రకారం ఏపీ స్థూల ఉత్పత్తిలో 3శాతం మాత్రమే అప్పు చేయవచ్చని, కానీ 2015 నుంచి ప్రభుత్వం పరిధి దాటి మరీ అప్పు చేసిందన్నారు. ఎక్కడా పనికొచ్చే ఖర్చు చేసినట్టు లేదని.. దుబారా ఖర్చులు, వృథా ఖర్చులు ఎక్కువగా చేశారని అన్నారు. అప్పు చేస్తే.. లాభదాయకంగా ఉండేలా ఖర్చు చేయాలని, గత ప్రభుత్వం అందుకు విరుద్దంగా అనవసర ఖర్చులు చేసిందన్నారు. కేవలం కాంట్రాక్టుల పేరుతో దోపిడీ చేసేందుకే అనవసర ఖర్చులు చేశారని అన్నారు.
వ్యవసాయరంగంపై మాట్లాడిన ఆర్థిక మంత్రి.. ‘1999- 2004 మధ్య కాలంలో 3.66 శాతం వృద్ధిరేటు ఉంది. 2004- 2009 మధ్య ఐదేళ్ల కాలంలో 6.14 శాతం నమోదైంది. కానీ గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం స్థూల ఉత్పత్తి తగ్గింది. చేపల, గొర్రెల పెంపకాల్లో వృద్ధిరేటు పెరగిందని.. వ్యవసాయ రంగం వృద్ధిరేటు పెరిగిందంటూ అంచనాలు తయారు చేశారు. చేపల పెంపకం పెరిగినంద మాత్రాన వ్యవసాయ వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది’ అని బుగ్గన ప్రశ్నించారు.