
పోలీసులను ప్రజలు మనవాళ్లే అనుకునేలా పనిచేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఏపీ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా ఉండాలని పిలుపునిచ్చారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుల పాత్రే చాలా కీలకమని ఆయన చెప్పుకొచ్చారు. అహంకారాన్ని దరిచేయనీయకుండా పోలీసులు ప్రజలను చిరునవ్వుతో పలకరించి, ఆహ్వానించాలని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో యధేచ్ఛగా ఉల్లంఘనలు జరిగాయని జగన్ గుర్తుచేశారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇసుక అక్రమరవాణాలో పోలీసులు జోక్యం చేసుకునే దుస్థితి ఉండేదని.. ఇసుక మాఫియాను పోలీసు వ్యవస్థ శాసించేదని ఆయన వెల్లడించారు.
మహిళా తహశీల్దార్‌పై దాడి చేసినా పట్టించుకోలేదని.. ఎమ్మెల్యేలు థియేటర్ల యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్లని ఆయన పేర్కొన్నారు. మన కళ్లెదుటే ఇన్ని అక్రమాలు జరుగుతున్నా.. ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకుపోవాలని, సమస్యలపై సానుకూలంగా స్పందిస్తే 50శాతం పరిష్కారమైనట్లేనని జగన్ చెప్పుకొచ్చారు. ఇక మన ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలకు తావివ్వొద్దని ఆయన సూచించారు.