మేనిఫెస్టో హామీల అమలుకు అడుగులు వేస్తోంది జగన్ సర్కార్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు వివరించారు ముఖ్యమంత్రి జగన్. అక్టోబర్ 15న రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని..ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించామన్నారు. దేశానికే ఆదర్శంగా ఉండేలా రైతు భరోసాను అమలుచేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు.
11 నెలల కాలానికి కౌలు రైతులకు గ్రామ సచివాలయమే కార్డులిస్తుందని వెల్లడించారు. సొంతదారులకు ఎలాంటి నష్టం లేకుండా..వారి హక్కులకు భంగం వాటిల్లకుండా చూస్తామన్నారు. ఈ ఏడాది మాత్రమే రబీకిస్తున్నామని..వచ్చే ఏడాది నుంచి మేలోనే ఇస్తామన్నారు. తద్వారా ఖరీఫ్‌లో రైతులకు అండగా ఉంటామన్నారు. కార్డులందగానే రైతు భరోసాకు అర్హులవుతారని ప్రకటించారు.