ఏపీలో ఎల్లుండి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించి రేపు బీఏసీ సమావేశం జరగనుంది. గతం కంటే భిన్నంగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు ఉదయం 10.30 గం.లకు బీఏసీ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలి. ఏ విధంగా జరపాలని అనే దానిపై రేపు జరిగే బీఏసీలో చర్చించకు రానుంది. ఇదే విషయంపై స్పీకర్ తమ్మినేని సీతారాం వివిధ శాఖల అధికారులతో సమావేశమై చర్చించారు.
మరోవైపు బడ్జెట్ సమావేశాలు దాదాపు 15 రోజులపాటు జరగనున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో పలు కీలకాంశాలు చర్చకు రానున్నాయి. అదేవిధంగా పది నుంచి 12 బిల్లులను సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 12 వ తేదీన ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయమంత్రి కన్నబాబు కూడా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షపార్టీ టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల విషయం తీవ్ర చర్చకు దారితీసే అవకాశముంది. అలాగే విత్తనాల కొరత కూడా సభలో చర్చకు రానుంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతున్నారు.