నవరత్నాల్లో ఒక్కటైన మద్యపాన నిషేధంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మద్య నిషేధం లక్ష్యంగా కొత్త పాలసీని రూపొందిస్తున్న ప్రభుత్వం.. అందులో భాగంగా మరో సరికొత్త ఆలోచనను చేస్తోంది. మద్యం వినియోగం తగ్గాలంటే అమ్మకాల సమయాల్లోనూ మార్పులు తేవాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక అక్టోబర్ నుంచి అమలులోకి రానున్న నూతన పాలసీలో మద్యం అమ్మకాలను సాయంత్రం 6గంటల వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
సాధారణంగా మద్యం అమ్మకాలు సాయంత్రం నుంచి రాత్రి వరకే ఎక్కువగా ఉంటాయి. మందు ప్రియులు అధికంగా రాత్రి వేళలోనే ఉంటారు. ఉదయం పనులకు వెళ్లిన కూలీలతో పాటు ఉద్యోగం చేసే వారు కూడా రాత్రి పూటే మందేస్తుంటారు. అందువల్లే రాత్రి అయిందంటే మద్యం షాపులన్నీ కిక్కిరిసి ఉంటాయి. ఇక ఆ సమయంలో షాపులు మూసేస్తే చాలావరకు అమ్మకాలు తగ్గుతాయన్నది ప్రభుత్వం అంచనా. అయితే దీనిపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం దీనిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కొత్త పాలసీలో ప్రభుత్వమే షాపులు నిర్వహించబోతోంది. షాపుల నిర్వహణ కోసం సిబ్బందిని నియమించనుంది. ఇక ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అంటే రెండు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేయాల్సి వస్తుంది. దాని వలన ప్రభుత్వానికి అదనపు భారం అవుతుంది. అందుకే సాయంత్రం 6గంటల వరకు అమ్మకాలను కుదిస్తే సిబ్బంది భారాన్ని కూడా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
తగ్గనున్న బ్రాండ్లు
కాగా మద్యంలో బ్రాండ్లను కూడా తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం వందల రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్సైజ్ శాఖతో ఒప్పందం చేసుకున్న సంస్థలన బ్రాండ్లన్నీ రాష్ట్రంలో అమ్ముతున్నారు. అందులో విస్కీ, బ్రాండీ, రమ్ము, వోడ్కా, బ్రీజర్, జిన్ లాంటి లిక్కర్ బ్రాండ్లే 270వరకు ఉన్నాయి. మిగిలినవన్నీ బీరు బ్రాండ్లు. ఇప్పుడు వీటిని కూడా తగ్గించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిమితమైన బ్రాండ్లను మాత్రమే అమ్మేలా చూసి, మిగతా వాటన్నింటికీ స్వస్తి పలకాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా అమ్మకాలు తగ్గించేందుకు సహాయపడుతుందని ప్రభుత్వం యోచిస్తోంది.
ఎక్సైజ్ అధికారులకు పెరగనున్న పని
కాగా మద్యం అమ్మకాల సమయాన్ని కుదిస్తే ఎక్సైజ్ సిబ్బందికి రాత్రి పని పెరిగే అవకాశం ఉంది. సాయంత్రంలో అమ్మకాలు ముగిస్తే అప్పటి నుంచి బెల్టుల్లో అమ్మకాలకు ఆస్కారం ఏర్పడుతుంది. వ్యవస్థీకృతంగా నడిచే బెల్టులను ప్రభుత్వం నిర్మూలించగలిగినా మొబైల్ తరహాలోని బెల్టులను నియంత్రించడం కష్టంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో సాయంత్రం నుంచి ఎక్సైజ్ సిబ్బందికి ప్రత్యేక నిఘా అవసరం. దీంతో వారికి పని పెరగనున్నట్లు తెలుస్తోంది. కాగా తాను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.