కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో 100 ఆవులు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని ఆవుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కంగారుపడిన నిర్వాహకులు గోశాలలో మిగిలిన ఆవులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శైవ క్షేత్రం పిఠాధిపతి శివస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న శివస్వామి, అక్కడి పరిసరాలను పరిశీలించారు.
అనంతరం శివస్వామి మాట్లాడుతూ శ్రావణమాస శుక్రవారం గోవుల మృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏకంగా వందకు పైగా ఆవులు చనిపోవడం అనేది హృదయ విదారకమని శివానంద ఆవేదన వ్యక్తం చేశారు. సామర్థ్యం లేని గోశాలలో 15 వందలకు పైగా గోవులను ఎందుకు ఉంచారని అన్నారు. ప్రభుత్వాలు గో రక్షణ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆవులకు ఆధార్ అమలు చేయాలని శివస్వామి డిమాండ్ చేశారు.