ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తరగతుల విలీనంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ఇంటి పక్కనే స్కూల్ ఉండాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూల్స్ లో చదివించే పేరెంట్స్ తమ పిల్లల్ని రోజూ బడిలో దింపి, తీసుకువస్తున్నారు కదా అని చెప్పడం గమనార్హం. మొదటగా మూడు కిలో మీటర్లు విలీనం చేయాలనుకున్నప్పటికీ.. ఆ తర్వాత కిలోమీటర్ కు తగ్గించామని వెల్లడించారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలే వారి అభిప్రాయం చెబుతారని, చట్టం చేసే ముందు ప్రజాభిప్రాయం తీసుకోలేం కదా అని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామన్న మంత్రి బొత్స (Minister Botsa Satyanarayana) .. తరగతుల విలీనంలో సమస్యలు వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. పాఠశాలలు విలీనం, మ్యాపింగ్ కారణంగా గవర్నమెంట్ స్కూళ్లల్లో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయని అందరూ అనుకుంటున్నారని, కానీ అందులో వాస్తవం లేదని చెప్పారు. బడుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియ ఆగస్టు 15కు పూర్తవుతుందని వివరించారు.
ప్రభుత్వ బడుల్లో పరిస్థితులు మెరుగుపరిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ లో చదవాలనే తపన, ప్రేరణ కల్పించి వారంతట వారే పాఠశాలకు వచ్చేలా చేయాలి. విద్యార్థులు తమకు నచ్చిన చోట పని చేసేందుకు వెసులుబాటు కల్పించాలి. కరోనా సమయంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం భారీగానే నమోదైంది. ప్రైవేటు స్కూల్స్ లో చదివే లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు వివరాలు ఇవ్వడంతో పాటు వివరణ కూడా ఇస్తాం.
– బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఉద్యోగులు సహకరించాలని మంత్రి బొత్స కోరారు. దాన్ని యథాలాపంగా అమలు చేయాలి. ఉద్యోగులకు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించాలని అడగాలని కోరారు. తరగతుల విలీనంపై ఎక్కడా వ్యతిరేకత లేదని.. 0.1 శాతంమంది వ్యతిరేకిస్తే 99.99 శాతం మంది అంగీకరిస్తున్నదానిని కాదంటామా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్యోగులు సమర్థించకపోయినా పర్వాలేదు గానీ సహకరించాలని మంత్రి బొత్స కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..