Vijayawada Rains: అల్లకల్లోలం.. భయం.. భయం.. బెజవాడకు అమావాస్య గండం..!

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో..సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే దిశలోకి వస్తాయి. అందువల్ల భూమిపై సూర్య, చంద్రుల ఆకర్షణ సాధారణ రోజులకంటే అధికంగా ఉంటుంది. దీంతో అమావాస్య రోజు ఒక మీటరు పైకి సముద్ర కెరటాలు ఎగసిపడతాయి. ఈ సమయంలో నదుల ద్వారా వెళ్లాల్సిన నీరు..

Vijayawada Rains: అల్లకల్లోలం.. భయం.. భయం.. బెజవాడకు అమావాస్య గండం..!
Vijayawada Rains

Updated on: Sep 02, 2024 | 8:57 PM

చరిత్రలో ఎరుగని వానలు, వరదలతో అల్లాడుతున్న బెజవాడ నగరాన్ని.. ఇప్పుడు అమావాస్య భయం వెంటాడుతోంది. వరదలకు.. అమావాస్యకు సంబంధం ఏంటంటరా..? నిజమే.. వానలు, వరదలకు అమావాస్యతో సంబంధం లేకపోయినా.. ఆ వరద నీరు సముద్రంలో కలవడానికి మాత్రం అమావాస్యతోనే సంబంధం ఉంటుంది. ఇప్పుడు విజయవాడ నగరంలో ఉన్న వరద నీరు తొలగిపోవాలంటే కృష్ణా నది ద్వారా అది సముద్రంలో కలవడమే మార్గం. అయితే నేడు అమావాస్య కావడంతో సముద్రం పోటు మీద ఉంటుంది. కెరటాలు భారీగా ఎగసిపడతాయి. దాంతో వరద నీరు వెనక్కి తన్నుకు వస్తుంది. సముద్రం పోటు మీదుంటే వరద నీటిని తనలో చేర్చుకోంది. ఈ వరద జలాలు సముద్రంలో కలవకుంటే విజయవాడకు ముంపు మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో నగర వాసులు భయపడుతున్నారు.

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో..సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే దిశలోకి వస్తాయి. అందువల్ల భూమిపై సూర్య, చంద్రుల ఆకర్షణ సాధారణ రోజులకంటే అధికంగా ఉంటుంది. దీంతో అమావాస్య రోజు ఒక మీటరు పైకి సముద్ర కెరటాలు ఎగసిపడతాయి. ఈ సమయంలో నదుల ద్వారా వెళ్లాల్సిన నీరు సముద్రంలో కలవకుండా..కెరటాలు అడ్డుపడతాయి. అమావాస్యకు రెండు రోజుల ముందు, రెండు రోజుల తర్వాత ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు..నిపుణులు. ఆ తర్వాత పరిస్థితి సాధారణంగా మారుతుందని..నదుల ద్వారా వచ్చే నీటిని సముద్రం తనలో కలుపుకుంటుందని చెబుతున్నారు. విజయవాడలో ప్రస్తుతం నీరు నిలిచిపోవడానికి..సముద్రంలో ఆటుపోట్లు కూడా కారణమని వివరిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీకి అంతకంతకూ వరద ప్రవాహం పెరగడంతో..11.39 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో బ్యారేజీలోని అన్ని గేట్లను ఎత్తి.. వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు వదులుతున్నారు. ఈ వరద నీరంతా కృష్ణా జిల్లాలోని హంసలదీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. అయితే ప్రస్తుతం అమావాస్య కావడంతో ఈ నీరంతా సముద్రంలో కలిసేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

వీడియో చూడండి..

మరి ఈ పరిస్థితి ఎంతవరకూ ఉంటుంది..? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..? అనే విషయంపై ఎన్‌ఐఓ రీజనల్‌ డైరెక్టర్‌ V.V.S.S శర్మ మాట్లాడుతూ.. సముద్రం పోటు మీదుంటే వరద నీరు కలవదు.. అమావాస్యకు ముందు 2 రోజులు.. అమావాస్య తర్వాత 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుదన్నారు. అమావాస్య, పౌర్ణమి రోజు ఒకేదిశలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఉంటాయి.. భూమిపై మరింత తీవ్రంగా సూర్యుడు, చంద్రుడి ఆకర్షణ.. ఉంటుంది.. అందుకే కెరటాలు భారీగా ఎగసిపడుతుంటాయని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..