Andhra Pradesh: దసరా సెలవులు ముగిసిన తెల్లారి అంతా స్కూల్‌కి వెళ్లారు.. ఒక్కసారిగా షాక్..

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆశ్చర్యపోయే ఘటన..! దసరా సెలవులకు ముందు బడికి తాళాలు వేసి వెళ్లారు ఉపాధ్యాయులు.. సెలవులు గడిచాయి.. మళ్లీ స్కూళ్ళు తెరిచేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులు, విద్యార్థులు సమయానికి అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడ స్కూలు భవనం కనిపించలేదు. అంతా శిధిలాలే ఉన్నాయి.

Andhra Pradesh: దసరా సెలవులు ముగిసిన తెల్లారి అంతా స్కూల్‌కి వెళ్లారు.. ఒక్కసారిగా షాక్..
Tribal School Collapses In Rain

Edited By: Ravi Kiran

Updated on: Oct 05, 2025 | 7:22 AM

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆశ్చర్యపోయే ఘటన..! దసరా సెలవులకు ముందు బడికి తాళాలు వేసి వెళ్లారు ఉపాధ్యాయులు.. సెలవులు గడిచాయి.. మళ్లీ స్కూళ్ళు తెరిచేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులు, విద్యార్థులు సమయానికి అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడ స్కూలు భవనం కనిపించలేదు. అంతా శిధిలాలే ఉన్నాయి. దీంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత తీవ్ర ఆవేదన చెందారు. ఎందుకంటే.. రోజూ తాము చదువుకునే బడి కూలిపోయింది. కళ్ళ ముందు శిథిలమైన గోడలు తప్ప.. భవనం నేలకొరిగింది.

వివరాల్లోకి వెళితే.. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోని జీ మాడుగుల మండలం వనబంగిపాడు గ్రామం. అక్కడ గిరిజన పిల్లలు చదువుకునేందుకు ఓ స్కూలు. దాదాపుగా 30 మంది చిన్నారులు రోజు పాఠాలు నేర్చుకునేవారు. వారికి ఉపాధ్యాయులు శ్రద్ధగా బోధించేవారు. నిత్యం స్కూలుకు వెళ్లి ఆ చిన్నారులు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినేవారు. ఖాళీ సమయంలో అక్కడే ఆడుకునేవారు. అందరిలాగానే దసరా పండక్కి ఆ స్కూలు పిల్లలకు సెలవు ప్రకటించడంతో.. బడికి తాళాలు వేశారు ఉపాధ్యాయులు. దసరా పండుగ గడిచింది. ఆ మరుసటి రోజే.. స్కూలు తెరిచేందుకు సిద్ధమయ్యారు. బడికి వెళ్లారు.. ఈలోగా విద్యార్థులు కూడా అక్కడకు చేరుకున్నారు. చూసేసరికి అక్కడ పాఠశాల భవనం కనిపించలేదు. కేవలం గోడలు, శిధిలాలే కనిపించాయి.

వీడియో చూడండి..

తీవ్ర వాయుగుండం ప్రభావంతో పాడేరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా గత కొన్ని రోజులుగా వర్షాలు కురిసాయి. వర్షాలు, గాలుల ప్రభావానికి.. అప్పటికే బలహీనంగా ఉన్న పాఠశాల భవనం గోడలు కూలిపోయాయి. దీంతో పైకప్పు పూర్తిగా ధ్వంసం అయింది. బడికి వెళ్లి చుసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు గుండెలు పట్టుకున్నారు. ఒకవేళ పాఠశాల వర్కింగ్ డేస్ లో కూలిపోయి ఉంటే ఊహించని ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గిరిజన విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు.

స్థానిక సర్పంచ్ రామకృష్ణ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని.. విద్యార్థులు ఉండి ఉంటే ప్రాణనష్టం జరిగేదని అన్నారు. గతంలో పలుమార్లు ఐటీడీఏ పీవో, ఉన్నతాధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని అన్నారు. పాఠశాల శిథిలావస్థకు చేరిన భవనాలను వెంటనే తొలగించాలని అన్నారు. విద్యార్థులు చదువుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకుని.. స్కూలు భవనం నిర్మించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..