AP News: క్యారెక్టర్ సర్టిఫికెట్ కోసం వెళ్లి క్యారెక్టర్ లేని పని చేశాడు.. ఆర్మీ జాబ్ చేయాల్సినోడు

అగ్నివీర్‌లో జాయిన్ అవ్వాలన్నది అతడి కల. ఆ సమయం రానే వచ్చింది. సెలక్షన్స్‌కు వెళ్లి.. అన్ని స్థాయిల్లో ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఇక క్యారెక్టర్ సర్టిఫికెట్ సమర్పించి.. జాబ్ ఎక్కడమే తరువాయి. కానీ ఇక్కడ అతడు చేసిన పొరపాటు వల్ల జాబ్ రిస్క్‌లో పడింది. కేవలం పార్టీ డిఫరెన్సెస్‌ అతడిని ఆర్మీ డ్రెస్ వేసుకోవాలన్న కలకు దూరం చేసే పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగింది.. ఎక్కడ తేడా కొట్టింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకా పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

AP News:  క్యారెక్టర్ సర్టిఫికెట్ కోసం వెళ్లి క్యారెక్టర్ లేని పని చేశాడు.. ఆర్మీ జాబ్ చేయాల్సినోడు
Lakkavarapukota Police

Edited By:

Updated on: Jul 30, 2023 | 5:48 PM

విజయనగరం, జులై 30: అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ సెలక్షన్స్‌కు క్వాలిఫై అయ్యి ఫైనల్స్‌కు వచ్చినవారికి క్యారెక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఆ క్యారెక్టర్ సర్టిఫికెట్ గ్రామస్థాయిలో అయితే గ్రామ సర్పంచ్, మునిసిపల్ కార్పోరేషన్‌లో అయితే మేయర్ సంతకంతో జారీ చేయడం నిబంధన. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం మార్లాపల్లికి చెందిన ఓ యువకుడు అగ్నివీర్ ఆర్మీ సెలక్షన్స్ ఫైనల్స్‌కి సెలక్ట్ అయ్యాడు. దీంతో క్యారెక్టర్ సర్టిఫికెట్ అవసరం కాబట్టి అందుకోసం గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. గ్రామ సచివాలయ సెక్రటరీ వెరిఫికేషన్స్ అన్నీ చేసి సర్టిఫికెట్ తయారుచేశారు. ఫైనల్‌గా సర్టిఫికెట్ పై గ్రామ సర్పంచ్ ముద్ర వేసి సర్పంచ్ గారి వద్దకు వెళ్లి సంతకం చేయించుకోమని యువకుడికి సర్టిఫికెట్ ఇచ్చి పంపించారు సెక్రటరీ. అయితే ఆ యువకుడు మాత్రం సర్పంచ్ వద్దకు వెళ్లకుండా తానే సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి క్యారెక్టర్ సర్టిఫికెట్‌ను తయారుచేశాడు. తరువాత విషయం తెలుసుకున్న సర్పంచ్ రామసత్యం క్యారెక్టర్ సర్టిఫికెట్ ని తనిఖీ చేయించాడు. దీంతో అసలు విషయం బయటపడింది.

తన సంతకాన్ని యువకుడు ఫోర్జరీ చేసినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సర్పంచ్ రామసత్యం. దీంతో యువకుడి కుటుంబసభ్యులు లబోదిబోమన్నారు. దీంతో అసలేం జరిగిందో అని జరిగిన ఘటన పై గ్రామస్తులు ఆరా తీశారు. దీంతో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గ్రామ సర్పంచ్ రామ సత్యం టిడిపి నాయకుడు కాగా, యువకుడు కుటుంబం వైసిపి. దీంతో సర్పంచ్ తనకు క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వరనే ఉద్దేశ్యంతో ఇలా సర్పంచ్ సంతకం యువకుడే చేసినట్టు తేలింది.

ఉద్యోగం తన భవిష్యత్తు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోర్జరీ చేశానని తెలిపాడు యువకుడు. ఏది ఏమైనా అవగాహన లేకుండా చేసిన పనికి యువకుడి పై కేసు నమోదు కావడంతో ఇప్పుడు అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అతడిని ఆర్మీ అధికారులు మందలించి.. జాబ్‌లోకి తీసుకుంటారా..? లేక తప్పు చేసినందుకు అతడిపై యాక్షన్‌ తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. కేవలం పార్టీ విబేధాల వద్ద.. అతడు జాబ్ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..